సరిగ్గా మూడు రోజుల క్రితమే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులని గట్టిగా నిరసించారు. వాటిని నిరోదించడానికి తమ ప్రభుత్వం ఫిరాయింపుల చట్టసవరణ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు.
ఆంధ్రలో భాజపా నేతలు కూడా వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ఫిరాయింపులకి ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, మిత్రధర్మం పాటించి మౌనం వహిస్తున్నారు. తెలంగాణాలో తెరాసతో పొత్తులు లేవు కనుక అక్కడి భాజపా నేతలు ఆ పార్టీని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంటే ఫిరాయింపులకి భాజపా వ్యతిరేఖమని అర్ధం అవుతోంది. కానీ ఆ నీతులు ఇతర పార్టీలకే తప్ప తమకి వర్తించవని భాజపాయే నిరూపించి చూపించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న భాజపా అప్పుడే ఆ రాష్ట్రంలో తన రాజకీయ కార్యక్రమాలు, వ్యూహాలు వేగవంతం చేసింది.
అధికార సమాజ్ వాదీ పార్టీని దెబ్బ తీసేందుకు ఆ పార్టీ నేతలని భాజపాలోకి ఆకర్షించడం మొదలుపెట్టింది. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర యువ మోర్చాకార్యదర్శి రాహుల్ యాదవ్, మరో ప్రముఖ నేత మనీధర్ పాల్ సింగ్, వారి అనుచరులని భాజపాలో రప్పించుకొంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో వారందరూ భాజపాలో చేరారు. కేశవ్ ప్రసాద్ మౌర్య రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే అధికార సమాజ్ వాదీ పార్టీని దెబ్బ తీయడం మొదలుపెట్టేశారు. మిగిలిన 8నెలల్లో ఇంకా ఎంత మందిని భాజపాలోకి రప్పిస్తారో చూడాలి. వేరే పార్టీల నేతలని పార్టీలో చేర్చుకోవడానికి భాజపాకి తప్పుగా కనిపించ లేదు. కానీ ఇతర పార్టీలు చేస్తేనే తప్పుగా కనిపించడమే విడ్డూరంగా ఉంది.