“ఢిల్లీకి మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది” – ఎన్నికలకు ముందు తిరుపతి బహిరంగ సభలో ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోదీ! “రాజధానికి లక్షకోట్లా? వికేంద్రీకరణే బిజెపి అభివృద్ధి విధానం! ఒకే చోట అన్ని నిధులు ఖర్చు చేయాలనుకోవడం లేదు”… విశాఖలో సోమవారం బిజెపి సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు
రెండేళ్ళు గడవక ముందే ప్రత్యేక హోదా అన్న హామీని వెనక్కి నెట్టేసి స్పెషల్ పేకేజి అన్నారు. రాజధానికి అంత ఖర్చుచేయాలనుకోవడంలేదని వీర్రాజు ద్వారా సూటిగానే చెప్పేశారు. ఇందులో రెండు మౌలిక అంశాలు వున్నాయి. అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకరించిన తప్పే అమరావతిలో కూడా చంద్రబాబు మళ్ళీ చేస్తున్నారన్న విమర్శ రాజకీయపార్టీల్లో, తటస్ధవాదుల్లో చివరకు తెలుగుదేశం అభిమానుల్లో కూడా వుంది.
వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధించాలన్న బిజెపి విధానం కూడా సూత్రబద్ధంగా సమర్ధనీయమే! అయితే రాష్ట్రరాజధాని ఎలావుండాలో నిర్ణయించుకునేది రాష్ట్రప్రభుత్వమే! ఈ విషయంలో ఒక నిర్ణయం జరిగిపోయింది. అందులో తప్పొప్పులకు తెలుగుదేశం…అంటే చంద్రబాబే బాధ్యుడు అవుతారు. ప్రజలకు ఇది నచ్చకపోతో వచ్చే ఎన్నికల్లో ఆయనపార్టీని ఈడ్చికొడతారు.
కేంద్రం రాష్ట్రానికి దయాదర్మంగా నిధులు ఇవ్వడంలేదు. ఆదాయాల్లో వాటా పొందడం రాష్ట్రాల హక్కు! రాజధానికి ఇంత ఖర్చు వద్దు అన్నది కేంద్రప్రభుత్వ విధానమైతే ఆవిషయం నేరుగా సూచించవచ్చు! అలాకాకుండా అన్ని విధాలా సహకరిస్తామని రెండేళ్ళుగా మాటలు కురిపిస్తూనే ఒకేచోట ఇన్ని నిధులు ఖర్చుచేయాలనుకోవడం లేదనడం నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం లాంటిదే!
అన్నిటికీ మించి ఇది ఫెడరల్ ధర్మానికి హానికరమే! రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని వెటకారం చేయడమే!!
నరేంద్రమోదీ గతంలోనే మనదేశానికి అధ్యక్షతరహా పాలనను సూచించారు. స్వయం కృషితో దేశమంతటా ఆవరించిన మోదీ శక్తిని చూసి ఈయన తప్పక రెండు పార్టీల వ్యవస్ధనే తీసుకురాబోతున్నారు అనిపించింది.
భిన్న జాతులు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు, జీవనవైవిధ్యాలు వున్న భారతదేశానికి కేంద్రీకృత రాజకీయవ్యవస్ధ సూటవ్వదు. రాష్ట్రాల హక్కులు, ప్రిరాగేటివ్ లు నచ్చకపోతే వాటికి సహకరించేది లేదనే ధోరణి ఇలాంటి కేంద్రీకృత వ్యవస్ధ వల్ల వచ్చేదే! ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, స్వయం నిర్యాధికారానికి తీవ్రమైన విఘాతమే! మోదీ హవాలో నిస్తేజమైన ఎన్నో ప్రాంతీయ, చిన్న రాజకీయపార్టీలు దేశ వ్యాప్తంగా పుంజుకుంటున్నది ఫెడరల్ హక్కులను బిజెపి కాలరాసేయగలదన్న భయం వల్లే!!