టీడీపీ, జనసేన పొత్తులు ఫైనల్ చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అంచనాకు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు ఫైనల్ చేసుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. చాలా రోజులుగా పవన్ బీజేపీని కలుపుకోవాలని అంటూనే ఉన్నారు. దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నోటా కంటే తక్కువ ఓట్లు గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చాయి. ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీ, జనసేనకు కలసి వచ్చేదేమీ లేదు. అయినా ఎందుకు పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాయి.
ఎన్నికలు సజావుగా సాగాలనే ఆకాంక్ష
ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా… వైసీపీకి సపోర్ట్ గా ఉండవద్దని కనీసం న్యూట్రల్ గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉద్దేశం కూడా అదే.
బీజేపీతో పొత్తు ఓట్ల పరంగా నష్టం
బీజేపీతో పొత్తు వల్ల కూటమికి ఓట్ల పరంగా కలసి వచ్చే అవకాశం లేదు. పైగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పొత్తును వ్యతిరేకించే వర్గాలు ఆ పార్టీకి దూరమవుతాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అసలు బలం లేని బీజేపీతో పొత్తులు పెట్టుకుని తర్వాత వారితో తామే గెలిపించామన్న మాటలు ఎందుకు పడాలన్న వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఉన్న అర శాతం బీజేపీ ఓటర్లు కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాం కదా అని టీడీపీకి ఓట్లు వేయరనే అంచనా ఉంది. అయితే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు కూడా టీడీపీకి వేసినట్లుగా రాజకీయవర్గాలు విశ్లేషించారు.
టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలు
నిజానికి టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. విజయం సాధించారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. అంతకు ముందు కూడా బీజేపీ, టీడీపీ కూటమిగా మారితే చాలా విజయాలు దక్కాయి. ఇటీవల అండమాన్‌లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించి బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు. అయినా మేయర్ సీటు ఇచ్చింది
ఎన్జీఏలోకి బలమైన మిత్రపక్షాల కోసం బీజేపీ చూపు
నమ్మకమైన మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యారు. బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాది… హింందీ రాష్ట్రాలు. అక్కడ 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం దక్కింది. రెండు సార్లు జరిగిన అద్భుతం మూడో సారి జరగకపోతే సీట్ల కోత పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. దక్షిణాదిపై ఆ పార్టీకి ఆశలు లేవు. అందుకే ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి. అందుకే టీడీపీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.