ఇప్పుడు నడుస్తున్నది మోడీ జమానా. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మోడీ ప్రజాదరణ మరింత భారీగా పెరిగింది. ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లోనూ పడుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. కాంగ్రెస్ తన చేతిలో ఉన్న రెండు రాష్ట్రాలనూ కోల్పోతుందట. బీజేపీ తన మిత్ర పక్షంతో కలిసి అధికారంలో ఉన్న పంజాబ్ ఈసారి “హస్త”గతం అవుతుందట. సమాజ్ వాదీ పార్టీకి ఘోర పరాజయం తప్పదని అంచనా. ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే ప్రాప్తమట. మోడీ, అమిత్ షా జోడీ మ్యాజిక్ ఇంకా నడుస్తోందనేది ఈ సర్వే సంకేతం.
కీలక రాష్ట్రం యూపీలో హంగ్ తప్పదన్నది సర్వే సారాంశం. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించే బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మెజారిటీకి 20 సీట్ల దూరంలో ఆగిపోతుందట. ఇది శుభసూచకంగా కాషాయ దళం భావిస్తోంది. మరో నాలుగైదు నెలల్లో ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి, పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి సమయం ఉందనేది బీజేపీ నేతల ధీమా.
403 సీట్లున్న యూపీలో బీజేపీ 170 నుంచి 183 సీట్లు గెల్చుకుంటుందని సర్వే అంచనా. బీఎస్పీ 115 నుంచి 124 సీట్లు గెలుచుకో వచ్చట. అధికార సమాజ్ వాదీ పార్టీ ఏకంగా మూడో స్థానానికి జారిపోతుందట. ఆ పార్టీ 94 నుంచి 103 సీట్ల వరకు గెలవవచ్చట. ఇక, ఈసారి యూపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ భారీ నిరాశ తప్పదు. దానికి 8 నుంచి 12 సీట్లు రావచ్చట. ఇంకో 20 సీట్లు పెంచుకోగలిగితే యూపీలో రాజ్యమేలవచ్చని కమలనాథులు ఆశాభావంతో ఉన్నారు.
ఉత్తరాఖండ్ లో ఇటీవల బీజేపీ విమర్శలపాలైంది. అయినా అక్కడి ప్రజలకు కమలానికే పట్టం
కట్టబోతున్నారని సర్వే అంచనా వేసింది. మొత్తం 70 సీట్లకు బీజేపీ 38 నుంచి 43 గెల్చుకోవచ్చు. కాంగ్రెస్ కు 26 నుంచి 31 సీట్లు రావచ్చు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మణిపూర్ లో ఈసారి కమలం వికసిస్తుందనే అంచనా సంచలనాత్మకం. మొత్తం 60 సీట్లలో బీజేపీ 31 నుంచి 35, కాంగ్రెస్ 19 నుంచి 24 సీట్లు గెలవవచ్చట.
బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో మరోసారి కమలం వికసిస్తుందట. చిన్న రాష్ట్రంలో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ వారు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం ఉండదట. మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ కూటమి 17 నుంచి 21 సీట్లు గెల్చుకోవచ్చట. కాంగ్రెస్ కు 13 నుంచి 15 సీట్లు దక్కవచ్చట. ఆమ్ ఆద్మీ పార్టీకి 1 నుంచి 3 సీట్లు రావచ్చట.
ఇక, పంజాబ్ లో ఎన్డీయే ఓటమి ఖాయమని సర్వే తేల్చింది. అకాలీదళ్, బీజేపీ కూటమి మూడో స్థానానికి జారిపోతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీ మాత్రం రాకపోవచ్చు. మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్ కాంగ్రెస్ 49 నుంచి 55 సీట్లు గెలవవచ్చు. పంజాబ్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 42నుంచి 46 సీట్లు గెలవవచ్చు. బీజేపీ- అకాలీ కూటమి 17 నుంచి 21 సీట్లు గెల్చుకోవచ్చు.