విజయవాడలో పుష్కరాల పనుల కోసం ఆలయాల విగ్రహాల తొలగింపుపై ఒక్కసారిగా రగుల్కొన్న వివాదం బిజెపి టిడిపిల అంతర్గత పరిస్థితికి అతకని కలయికకు అద్దం పడుతుంది. కేంద్ర రాష్ట్రాలలో కలసి పాలిస్తున్న పార్టీలు పరస్పరం కలహించుకోవడమే ఇక విచిత్రమైతే మళ్లీ ఆయా పార్టీలలో రెండు గొంతులు వినిపించడం విపరీతం! పుష్కరాల పనులు మాత్రమే గాక విపరీతమైన విస్తరణ నేపథ్యంలో బహుశా ఇలాటి సమస్యలు ఇంకా పెరగొచ్చు. భక్తి ప్రపత్తుల ప్రదర్శనలో బిజెపిని మించిపోయిన తెలుగుదేశం నేతలు ఎందుకు ఈ వివాదానికి ఆస్కారమిచ్చారనేది ఆసక్తికరం. ఉత్తరోత్తరా అనేక నిర్మాణాలు పర్యాటక వినోదాల కాంప్లెక్సుల దృష్ట్యానూ స్థలాల వివాదాల రీత్యానూ ఇలాటి వాటికి అలవాటు చేయడమే మంచిదని తెలుగుదేశం నేతలు భావించవుండొచ్చు. గోదావరి పుష్కరాల హంగామా విషాద ఘటనల రీత్యా కృష్ణా పుష్కరాలపై ఇంకా ఎక్కువ కేటాయింపులు కేంద్రీకరణ వున్నాయి.సరిగ్గా తమ ప్రమేయం లేకుండా అంతా తెలుగుదేశం ఖాతాలోకి పోతుందనే భావం బాధ బిజెపికి వున్నాయి. అంతకు ముందు నుంచి రెండు పార్టీల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఎలాగూ వుండనే వుంది. కేశినేని నాని, బుడ్డా వెంకన్న వంటి వారు టిడిపి వైపున, సోము వీర్రాజు, మరికొందరు బిజెపి వైపున తీవ్రంగా మాట్లాడారు. హెచ్చరికలు చేసుకున్నారు. సాయింత్రానికి టిడిపి మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు వంటివారు సామరస్య రాగం వినిపించారు. తెలుగుదేశం వివాదం ,విచారం, బిజెపి సర్దుబాటు అన్నీ రాజకీయ కోణంలోనే ఎక్కువగా అర్థమవుతాయి. ఆలయాలు ప్రార్థనా స్థలాల తరలింపు లేదా తొలగింపు వంటివిషయాల్లో చాలా జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరించవలసిందే. కొన్ని చోట్ల స్థానిక నేతలు ఏకపక్షంగా దుందుడుకుగా వెళ్లారన్నది కనిపిస్తుంది. అయితే అసలు వాటిని తాకరాదంటే కూడా సమస్య అవుతుంది.విస్తరణలు జనాభా పెరుగుదల వంటి కారణాల వల్ల ఆలయాలను కూడా తరలించడం తప్పనిసరి కావచ్చు. అసలు ఎక్కడంటే అక్కడ ఆలయాలు ఏర్పాటు చేయడం దేవుడికే అవమానమని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంప్రదాయికంగా వస్తున్నవి గాక స్వాములు రాజకీయ నేతలు కొన్నిసార్లు కబ్లాదార్లు కూడా ఆలయాలను ప్రతిష్టించేయడం అన్ని చోట్లా చూస్తాం. అసలే ఇరుకైన విజయవాడలో ఇప్పుడు రాజధాని అవసరాలకోసం నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇలాటివాటిని తొలగించాల్సి వస్తుంది.అయితే తగు జాగ్రత్తలతో ఆ పనిచేస్తే వివాదాలు వచ్చేవి కావు. వచ్చిన తర్వాతనైనా సామరస్యంగా పరిష్కరించుకోకుండా రాజకీయ ప్రాబల్యం కోసం హడావుడి చేశారు.అంతా అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా వెనక్కుతగ్గినట్టు మాట్లాడుతున్నారు. బిజెపి మంత్రులైతే వీర్రాజు తదితరులు చెప్పింది మా పార్టీ అభిప్రాయం కాదంటున్నారు. ఇక్కడ కూడా సంఘ పరివార్‌కు బిజెపికి ఏదో తేడా వున్నట్టు చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రజలందరికీ సంబంధించిన అంశాలలో ఇలా గ్రూపులు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట మాని అందరినీ కలుపుకుని పోవాలి.అసలు పుష్కరాలపై అఖిలపక్షం వేసి అభిప్రాయాలు తీసుకుంటే మరీ మంచిది.