ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యం కోసం భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. టీడీపీ సర్కారుతో ఉన్న పొత్తు నేపథ్యంలో భాజపా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందో అందరికీ తెలిసిందే. ఏపీలో భాజపా విస్తరణకు టీడీపీతో పొత్తే ప్రతిబంధకం అని నేతలు విమర్శిస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం ఏపీ విషయంలో భాజపా పట్టుదల ఇంకోలా ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఎన్నెన్ని స్థానాలు తమకు కావాలనే విషయమై భాజపా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇదే విషయమై పార్టీలో అంతర్గతం చర్చ జరిగిందనీ, తెలుగుదేశంతో పొత్తు కొనసాగిస్తూనే… తమకు కావాల్సిన స్థానాల విషయంలో రాజీపడొద్దనే ఉద్దేశంతో ఆ పార్టీ ఉన్నట్టు సమాచారం.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రా నుంచి కనీసం పది నుంచి పదిహేను ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలంటూ భాజపా కోరాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అలాగే, అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా భాజపా క్లియర్ గానే ఉందని సమాచారం. కనీసం ఓ యాభై అసెంబ్లీ సీట్లైనా దక్కించుకోవాలని భాజపా నిర్ణయించుకున్నట్టు సమాచారం. విశేషం ఏంటంటే.. ఇదే విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుసని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఆయన కూడా టీడీపీ నాయకుల్ని ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న టీడీపీ లీడర్లనూ, ఎంపీ సీట్లు ఆశిస్తున్నవారినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ముందస్తుగానే కొన్ని కామెంట్స్ చేసినట్టు సమాచారం. అప్పటి పరిస్థితిని బట్టీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలంటూ కొంతమంది నాయకులతో చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పినట్టు సమాచారం. తమకు కావాల్సిన సీట్లకు సంబంధించిన డిమాండ్లను కొంతమంది భాజపా నేతలు ఇప్పటికే చంద్రబాబు ముందుంచారనీ అంటున్నారు.
ఏదేమైనా.. ఏపీపై తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు భాజపా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేసిందని చెప్పాలి. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా పొత్తు విషయమై మరింత క్లారిటీ వస్తుంది. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. భాజపాతో పొత్తు కొనసాగించేందుకు టీడీపీ ఎంతైనా చేస్తుందన్నది తెలుస్తూనే ఉంది. సో.. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భాజపా ఇప్పటి నుంచే సీట్ల లెక్కలు మొదలుపెట్టేసింది.