బేటీ బచావో.. బేటీ పడావో… అంటూ.. మోడీ ప్రభుత్వం…ఆడపిల్లలను కాపాడాలంటూ.. ఓ ఉద్యమం చేసింది. దీన్ని… హర్యానాలోనే ప్రారంభించింది. అక్కడే మహిళలపై ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ ప్రచారం ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోనే మహిళలపై ఆకృత్యాలు చేసి.. జైలుకెళ్లిన ఓ నేత.. ఎమ్మెల్యేగా గెలిచి… మద్దతు ఇస్తామని ముందుకు రావడంతో.. బీజేపీ నేతలు ఆయనకు సలాం కొట్టేశారు. ఆ నేత పేరు గోపాల్ కాండా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆరు సీట్లు తక్కువ పడటంతో.. ఇండిపెండెంట్లపై బీజేపీ కన్నేసింది. గోపాల్ కాండాతోనూ చర్చలు జరిపింది. వేరే ఆప్షన్ లేకపోతే.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. కానీ దుష్యంత్ చౌతాలా మద్దతు ఇవ్వడానికి అంగీకరించడంతో ప్రమాదం తప్పిపోయింది.
గోపాల్ కాండా మద్దతు తీసుకోవడానికి అంగీకరించడంపై బీజేపీలోనే ఆగ్రహం వ్యక్తం అయింది. ఉమాభారతీ తీవ్ర స్వరంతో వ్యతిరేకించారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన చేసిన పాపాలు సమసిపోవని ఆమె అన్నారు. గోపాల్ కాండాకున్న క్రిమినల్ రికార్డును పలువురు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శివసేన కూడా..ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలోని సిర్సాకు చెందిన గోపాల్ కాండా ఎలక్ర్టీషియన్గా, చెప్పుల షాపు యజమానిగా వ్యాపారం ప్రారంభించారు. రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ క్రమంలో చేసిన దందాలకు సంబంధించి పది క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చౌతాలా కుటుంబంలో సాన్నిహిత్యం కారణంగా గోపాల్ కాండా ఆర్థికంగా బాగా లాభపడినట్లు చెబుతారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన మెజార్టీ రాకపోతే ఇండిపెండెంట్గా గెలిచిన గోపాల్ కాండా మద్దతివ్వడంతో పాటు మరికొందరు స్వతంత్రులను కూడా కూడగట్టారు. తర్వాతి కాలంలో అతను ఎయిర్ లైన్స్ సంస్థను ప్రారంభించి… మూసేశారు. అతని ఎయిర్ లైన్స్ సంస్థలో పనిచేసిన గీతికా శర్మ అనే ఎయిర్ హోస్టెస్… ఆత్మహత్య చేసుకుంటూ దానికి గోపాల్ కాండానే కారణమని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి వ్యక్తి మద్దతు తీసుకోవడం సరికాదన్న వాదనలు రావడంతో బీజేపీ ఇప్పడు పునరాలోచనలో పడింది. జేజేపీ ముందుకు రావడంతో.. ఇప్పుడు గోపాల్ అవసరం బీజేపీకి లేకుండా పోయింది. కానీ.. అవ్వాల్సిన డామేజ్ మాత్రం అయింది.