గెలిచినా, ఓడిపోయినా ప్రాంతీయ పార్టీల పట్ల ఎలాంటి వైఖరితో వుండాలో బిజెపికి బీహార్ ఎన్నికలు పాఠం నేర్పించబొతున్నాయి. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలను ఆపై సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కోడానికి కొత్తపాఠాల అవసరం బిజెపికి గట్టిగా వుంది.
కాంగ్రస్ కు సమాంతర శక్తిగా బిజెపి ఎదిగి అధికారంలోకి రావడానికి అర్ధశతాబ్ధం పట్టింది. సిద్ధాంత నిబద్ధతతో కాంగ్రెస్ మీద పోరాడటం లోనే నైపుణ్యాన్ని సాధించింది. భిన్న భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు వున్న భారతదేశంలో ఎక్కడ ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలో కాంగ్రెస్ కి తెలిసినట్టు బిజెపికి తెలియదు. అవినీతి, పాలనారాహిత్యాల్లో బలహీనపడి వున్న దశలో కాంగ్రెస్ ను బిజెపి చావుదెబ్బతీసింది. అది కూడా సాంప్రదాయిక బిజెపి వల్ల కాక, అన్నీ తానే అయి నరేంద్రమోదీ మోడిఫై చేసిన బిజెపివల్ల మాత్రమే జరిగింది. ఆవేగం పార్లమెంటులో నే ఆగిపోకుండా హర్యానా మహారాష్ట్ర లకు కూడా విస్తరించింది. అయితే విద్యావంతులైన మధ్య తరగతి ప్రజల ప్రభావం అధికంగా వుండే ఢిల్లీలో బిజిపి అవమానకరంగా ఓడిపోయింది.
మరోవైపు ప్రభుత్వమన్నా పార్టీ అన్నా తనే అన్నంత విశ్వరూపంగా విస్తరించిన నరేంద్రమోదీ పాలనలో ప్రజల అంచనాలు ఆశలు పెరిగిపోయాయి. అవన్నీ నెరవేరకపొతూండటంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చిన్నగా నిరాసక్తత మొదలైంది. ఇంతేకాకుండా మిత్రపక్షాలతో వ్యవహరించే తీరులో కూడా బిజెపి విఫలమౌతోంది. పంజాబ్‌లో అకాలీ దళ్ తో సంబంధాలు అంటీముట్టనట్టే వున్నాయి. ఆ పార్టీతో కలసి ఉన్నంత కాలం తాను బలపడే అవకాశం లేదని బిజెపి భావిస్తోంది. హర్యానాలోని బిజెపి ప్రభుత్వ పోకడల పట్ల అకాలీదళ్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అకాలీ దళ్ నాయకులు బిజెపిని మీడియాలో విమర్శిస్తూనే వున్నారు. జమ్మూ కాశ్మీర్లో పిడిపితో సంబంధాలు మొదటినుంచీ సజావుగా లేవు. అగ్రనాయకత్వం రుద్దిన ఈ పొత్తు బిజెపి కేడర్ కు నాయకులకు ఇష్టం లేదు. జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ చర్యలు బిజెపి కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా ఉన్నాయి.
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న శివసేనతో సంబంధాలు మెరుగుపరచుకునే ప్రయత్నాలు బిజెపి అధిష్ఠానం నుండి జరగడం లేదు. నరేంద్ర మోడీ సురేష్ ప్రభును పార్టీకి రాజీనామా చేయించి, బిజెపి లో చేర్చుకొని కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుండి రెండు పార్టీల మధ్య సంబంధాలు దేబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయ శక్తిగా శరద్ పవార్ ను దువ్వే ప్రయత్నం బిజెపి చేస్తున్నా ఈరెండు పార్టీల తగాదాలో అడ్వాంటేజి తీసుకోడానికి ఆయన ముందుక వస్తారా అన్నది అనుమానమే!
ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు దేశం తో పొత్తుపై బిజెపి రెండుగా విడిపోయింది. తెలుగు దేశంతో పొత్తు ఉన్నంత కాలం తాము ఎదగలేమని స్థానిక బిజెపి నాయకులు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని నిలబెట్టు కోవడం లేదని తెలుగు దేశం అసంతృప్తితో ఉంది. బిజెపితో కలసి ఉంటే ఒరిగేదేమీ లేదని, ఎన్నికల నాటికి బంధాలు తెంచుకోవాలని తెలుగుదేశం ఆలోచనల్లో పడింది.
నరేంద్రమోదీ అభివృద్ధికి నమూనాగా బిజెపి ప్రదర్శిస్తున్న గుజరాత్ లో డొల్లతనాన్ని రిజర్వేషన్లకోసం పటేళ్ళు సాగిస్తున్న ఉద్యమం బయట పెట్టింది.
ఇన్ని వ్యవస్ధాగత, అంతర్గత లోపాల మధ్య బీహార్ ను ఎదుర్కొంటున్న బిజెపి లో కూడా కాంగ్రెస్ మాదిరిగానే అంతర్గత వైరుధ్యాలు ముఠాతగాదాలు పెరిగిపోతున్నాయి. దేశ విదేశాల్లో బిజెపి ప్రచారకర్తగా నరేంద్రమోదీ వున్నారు. అంతర్గత సమస్యలను చక్కబెట్టడానికి సమర్ధవంతమైన యంత్రాంగమే లేదు. మిత్రపక్షాలతో సంబంధాలు వెనక్కిపోవడమే తప్ప మెరుగుపడకపోవడమే ఇందుకు తార్కాణం. అంతేకాకుండా మాతృసంస్ధ ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగత్ ” రిజర్వేషన్ లను సమీక్షించాలి” అని ఇచ్చిన పిలుపు కులప్రభావం విపరీతంగా వున్న బీహర్ మీద చూపే ప్రభావం తక్కువకాదు. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన బెట్టి నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ ఉమ్మడిగా గా చేస్తున్న పోరాటం నాలుగో రౌండ్ కి చేరేసరికి బిజెపి ని డిఫెన్సులో పడేసినట్టు కనిపిస్తోంది.