ఆరు నెలల కిందట బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెలంగాణ అధికార పీఠం కోసం పోరు జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎనిమిది సీట్లలో గెలిచి.. ముఖ్య నేతలందరూ ఓడిపోయి.. గొప్ప విజయం సాధించామని సెలబ్రేట్ చేసుకుంటోంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్, టల రాజేందర్ ఇలా మహమహులైన నేతలంతా ఓడిపోయారు. కిషన్ రెడ్డి హోం టర్ఫ్ అంబర్ పేటలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
పోవాల్సిన పరువు అంతా పోయింది. కానీ నిజామాబాద్, ఆదిలాబాద్ ఓటర్లు మాత్రం ఆ పార్టీ పరువు కాస్త కాపాడారు. 2018లో కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. అది కూడా గోషామహల్ నియోజకవర్గంలో . ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మరో ఏడు స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలే కానీ ఆ పార్టీ ఐదేళ్లలో ఎదిగి.. పడిపోయిన వైనం చూస్తే.. రాజకీయాల్లో ఇంత చేతకాని వాళ్లు కూడా ఉంటారా అని అనుకోక తప్పదు. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్గా తొలగించక ముందు బీజేపీ దూకుడు మీద ఉండేది. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి త్రిముఖ పోరులో అధికారం కోసం పోటీ పడాల్సిన కీలక పొజిషన్లో ఉండాల్సిన పార్టీ 2023 నాటికి దిగజారిపోయింది.
ఈ ఐదేళ్లలో ఎంతో హై ని చూసిన బీజేపీ.. తీరా అసలు యుద్ధంలో మాత్రం.. తేలిపోయింది. ఆ పార్టీని ఎవరో తొక్కేయలేదు. ఆ పార్టీ నేతలే తొక్కేశారు. దక్షిణాది రాజకీయాలను అర్థం చేసుకోవడంలో బీజేపీ అగ్రనేతలు విఫలమయ్యారా లేకపోతే ఢిల్లీ రాజకీయాల కోసం వ్యూహాత్మకంగా కావాలనే ఆ పార్టీ ఎదుగుదలను నియంత్రించారా అన్నది వాళ్లేక తెలియాలి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఓడించుకుంటుందని సెటైర్లు వేస్తారు.. కానీ తెలంగాణలో బీజేపీని మాత్రం.. .బీజేపీనే ఓడించుకుంది..మళ్లీ పెరుగుతుందో లేదో చెప్పలేం. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగితేనే ఆ చాన్స్ ఉంటుంది