ఎన్నికల ఫలితల తర్వాత బీఆర్ఎస్ ఉండదని కిషన్ రెడ్డి మాత్రమే కాదు బండి సంజయ్ సహా బీజేపీ నేతలందరూ చెబుతున్నారు. వారు ఈ మాటల్ని ఆషామాషీగా అనడం లేదు. అందుకే బీఆర్ఎస్ నేతలు కూడా ఉలిక్కి పడుతున్నారు. సొంత పత్రికల్లో పేజీలకు పేజీలు.. ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా నిలబడ్డాయో చెబుతున్నారు. దక్షిణాదిన అసలు ప్రాంతీయ పార్టీల్ని ప్రజలు వదులుకోరని అంటున్నారు. ఇదంతా బీఆర్ఎస్ ఉలికి పాటును బయట పెడుతోంది. దీనికికారణం ఎన్నికల తర్వాత బీజేపీ అమలు చేయబోయే రాజకీయ వ్యూహంపై వారికి స్పష్టత ఉండటం.
కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ లోక్ సభ సీట్లు వస్తే .. ఆ పార్టీ కాంగ్రెస్ సర్కార్ ఉసురు తీస్తుందని బీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకే చాలా చోట్ల బీజేపీకి పరోక్షంగా సహకరించింది. ఇది బీజేపీ నేతలకు చెప్పి ఇచ్చిన సహకారం కాదు., తమ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇచ్చిన సహకారం. కానీ అదే ఆ పార్టీకి సమస్యగా మారనుంది. లోక్ సభ సీట్లు ఎక్కువ వచ్చినా రేవంత్ సర్కార్ ను కూల్చే ప్రయత్నం బీజేపీ చేయదు. బీజేపీ ప్రధమంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కిషన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు .
ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కనీస బలం చూపించలేకపోతే ముఖ్యంగా గట్టి ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. తాము బలపడేందుకు అయినా.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి తెచ్చుకుంటుంది. కాంగ్రెస్ పై అసంతృప్తి ఎంత పెరిగితే బీజేపీకి అంత మేలు జరుగుతుంది. ఇంత కాలం అన్ని పార్టీలకు చాన్సిచ్చారు.. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వమని అడగితే.. ప్రజలు స్పందించే అవకాశం ఉంది. అలా చేయాలంటే బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థం చేయాలి. బీజేపీ అదే చేసే ప్రణాళికలో ఉంది.