మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం, అతని భార్య అన్యోన్యతను చూసిన నాగార్జున, సోనాలిబెంద్రేకు ఓ డౌట్ వస్తుంది. మీది ప్రేమ వివాహమా.. అనేది ఆ డౌట్. దానికి బ్రహ్మానందం.. తనదైన స్టైల్లో సమాధానం చెబుతారు. ” ముందు తను.. ప్రేమించింది.. తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది..” అని. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలకూ… ఇదే పరిస్థితి. వారిలో చాలా మందిని బీజేపీ ప్రేమిస్తోంది. వాళ్లు కూడా బలవంతంగా ప్రేమించే పరిస్థితి తెస్తోంది. మరో చాయిస్ కూడా ఇవ్వడం లేదు.
కేంద్రంలో రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ.. తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. బలపడేందుకు నేతల్ని చేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో… కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్లో పదవులు లేని.. నిరాదరణకు గురవుతున్న సీనియర్లపై దృష్టి పెట్టారు. ముందుగా వారిపై పుకార్లు రేపుతున్నారు. మీడియాకు లీకులిస్తున్నారు. వారి అభిప్రాయాన్ని రియాక్షన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రొసీడ్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా.. తెలంగాణ నుంచి పలవురు నేతలు బీజేపీలో చేరారు. అయితే.. ఓ స్థాయి ఉన్న నేతలెవరూ చేరలేదు. వారిని చేర్చుకోవడానికి బీజేపీ ఇప్పుడే ఆపరేషన్ ప్రారంభించారు. ముందుగా.. తమకు కావాలనుకున్న నేతలపై.. బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని ప్రారంభించారు.
టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లాంటి సీనియర్ల మీద కూడా.. ఇలాంటి ప్రచారం చేశారు. వారు ఇప్పటికైతే ఖండించినా.. ఇలాంటి ప్రచారంతో.. వారిపై సొంత పార్టీలోనే.. అపనమ్మకం ప్రారంభమవుతుంది. తర్వాత బీజేపీ నుంచి ఆఫర్లు పెరుగుతాయి. కాదూ..కూడదంటే.. కేంద్రంలో అధికార పార్టీగా.. ఇతర ఆప్షన్లు బీజేపీ వద్ద ఉంటాయి..కాబట్టి బీజేపీని వాళ్లు కూడా ప్రేమించకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. బీజేపీకి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్.. అధికార పార్టీ కావడమే. అందుకే.. రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీ అయినా… ప్రతిపక్ష పార్టీ అయినా.. బీజేపీ వ్యూహాలకు.. కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఉంది.