జూనియర్ డాక్టర్లపై రోగి బంధువుల దాడితో బెంగాల్లో ప్రారంభమైన వైద్యుల సమ్మె దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అసలు ఘటనతో దీదీకి ఏం సంబంధం లేకపోయినా .. వారు డిమాండ్ చేశారు. మొదట.. కఠినంగా వ్యవహరించిన మమతా బెనర్జీ.. రోగులు ఇబ్బంది పడుతూండటంతో.. క్షమాపణ చెప్పారు. అయినా సరే వైద్యులు సమ్మె విరమించడం లేదు.
సీఎంను బ్లాక్ మెయిల్ చేసేంత ధైర్యం వైద్యులకు ఎవరిచ్చారు..!?
సీఎం మమతా బెనర్జీకి, సమ్మె చేస్తున్న వైద్యులకు మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోంది. సమ్మె విరమించేందుకు వైద్య సంఘాలు ఆరు షరతులు విధించాయి. వైద్యులను రోగి బంధువులు కొట్టిన సంఘటనలో మమతా బెనర్జీ తీరు పట్ల వైద్య సంఘాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. ఎస్ఎస్కేఎం ఆస్పత్రి వద్ద ఆమె వైద్యుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆమె ఆస్పత్రి దగ్గరకు వచ్చి క్షమాపణ చెబితేనే తాము విధుల్లోకి చేరతామని వైద్య సంఘాలు కుండ బద్దలు కొట్టి చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పినా.. డిమాండ్లకు అంగీకారం తెలిపినా.. వైద్యులు మాత్రం.. ఏదో ఓ కారణం వెదుక్కుని సమ్మె కొనసాగిస్ున్నారు. వైద్యుల వెనుక బలమైన శక్తి ఉన్నది.. అది బీజేపీనేనని.. మమతా బెనర్జీ నమ్ముతున్నారు.
జోక్యం చేసుకునేందుకు కేంద్రం తహ.. తహ..!
మరో వైపు బెంగాల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది. బెంగాల్ డాక్టర్ల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండో సారి స్పందించింది. బెంగాల్లో వైద్య సేవలకు ఆటంకం కలగడంతో పాటు, వైద్యులపై దాడికి సంబంధించిన ఘటనలపై తక్షణమే నివేదిక పంపాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.మరో పక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధి బృందం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్‌కు వినతిపత్రం సమర్పించింది. వైద్యులపై దాడి ఆటవిక చర్య అంటూ..డాక్టర్లకు భద్రత కల్పించేందుకే కేంద్రమే ఒక చట్టం చేయాలని సూచించింది.
బెంగాల్లో అస్థిరత రాజకీయ పాపం కాదా..?
ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చినప్పటి నుంచి బెంగాల్ అలాగే రగిలిపోతూ ఉంది. ఆస్పత్రి వ్యవహారం బయటకు వచ్చే వరకూ… రాజకీయ హింస జరిగింది. దానిపై బీజేపీ చేయాల్సినంత రచ్చ చేసింది. ఇప్పుడు.. ఆస్పత్రి వ్యవహారం… డాక్టర్ల సమ్మె బయటకు వచ్చింది. ఇక్కడ నేరుగా.. బీజేపీకి .. బెంగాల్ వ్యవహారాల్లో.. జోక్యం చేసుకునే అవకాశం రావడంతో.. రాజకీయ హింస కార్యక్రమాలను నిలిపివేసి దీనిపై దృష్టి పెట్టారు. మొత్తానికి బెంగాల్ లో ప్రజలను హింసించి రాజకీయ అస్థిరత.. తెచ్చి పెడుతున్నారు.