పాక్షిక జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమయింది. రాజకీయాలు వేగంగా మారిపోతూండటం…. తమ ప్రభ వేగంగా ఆరిపోతూండటంతో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది చివరిలో లోక్‌సభతో పాటు 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. సాధారణంగా ఏడాది చివరిలో చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు.. పది నెలలోపు గడువు ఉండే అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, ఒరిస్సా శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించనుంది.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ బిల్లులు రెడీ అయ్యాయని జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. ఓ వైపు పెరుగుతున్న అధికార వ్యతిరేకత… ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడటంతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. వచ్చే ఏడాది దాకా ఆగితే విపక్ష పార్టీలకు మరింత సమయం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. నవంబర్ తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. రూ.2 వేల కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహితంగా ఉండే పార్టీలకు ముందస్తు ఎన్నికలపై … సంకేతాలిస్తోంది బీజేపీ. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు కూడా నేరుగా చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికలు బీజేపీకి అచ్చి రాలేదు. వాజ్‌పేయి హయాంలో భారత్ వెలిగిపోతోందన్న నినాదంతో ముందస్తు ఎన్నికలు వెళ్లారు. కానీ పరిస్థితి అనుకూలంగా మారలేదు. ఓటమి చవి చూడాల్సి వచ్చింది. పదేళ్ల పాటు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు బీజేపీకి ఎదురీదుతోంది. అయనా ముందస్తు ఆలోచన చేస్తోంది. ఇంకా లేటు చేస్తే.. ఇబ్బంది పడతామనే ఆలోచనతోనే ముందస్తుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ సారి కలిసి వస్తుందో.. మొత్తానికే మోసం వస్తుందో.. కాలమే నిర్ణయించాలి.