ఈశాన్య రాష్ట్రాలలోకి భాజపాని విస్తరించాలనే ఉద్దేశ్యంతో అరుణాచల్ ప్రదేశ్ ని హస్తగతం చేసుకొనేందుకు భాజపా చేసిన అప్రజాస్వామిక ఆలోచనలకి, ప్రయత్నాలకి సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నంబం తుకి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు భాజపాకి అవకాశం కల్పిస్తూ శాసనసభ సమావేశాల తేదీలని ముందుకు జరపిన ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్ ఖోవ ఇచ్చిన ఆదేశాలని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అది చట్ట వ్యతిరేకమని కనుక ఆ ఆదేశాలు చెల్లవని బుదవారం తీర్పు చెప్పింది. అలాగే స్పీకర్ నబం రెబియా తొలగింపు కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. డిసెంబర్ 15, 2015 నాటి యథాతథ పరిస్థితిని పునరుద్దరించాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం భాజపా ఎమ్మెల్యేలు, తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కలికో పౌల్ తక్షణం తన పదవి నుంచి దిగిపోవలసి ఉంటుంది. నబం తుకి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇది భాజపాకి చెంప దెబ్బవంటిదేనని చెప్పక తప్పదు. గవర్నర్ సహాయంతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన నబం తుకి ప్రభుత్వాన్ని కూల్చి వేసినందుకు తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది.
ఇది ప్రజాస్వామ్య విజయమని, మన న్యాయవ్యవస్థ గొప్పదనాన్ని సూచిస్తోందని మాజీ ముఖ్యమంత్రి నంబం తుకి అన్నారు. ఆయన మాటలు అక్షరాల నిజమని అంగీకరించక తప్పదు.
అయితే నబం తుకి మళ్ళీ అధికారం చేపట్టేందుకు సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసినప్పటికీ ఆయన శాసనసభలో తన మెజార్టీని నిరూపించుకోవలసి ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 60 మంది సభ్యులుంటే వారిలో కాంగ్రెస్ పార్టీకి 47 మంది ఉన్నారు. అయితే వారిలో 21 మంది భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కలికో పౌల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్నారు. మిగిలినవారిలో 11మంది భాజపా, మరో ఇద్దరు ఇతర పార్టీకి చెందిన వారున్నారు. కనుక ఆ 21మంది మద్దతు ఇస్తే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. వారు అందుకు అంగీకరించకపోవచ్చు కనుక నబం తుకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కలికో పౌల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చినప్పటికీ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనబడుతోంది.