ఇసుక కొరత విషయంలో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు కానీ.. ఏపీ బీజేపీ మాత్రం.. అంత సమయం ఇవ్వాలనుకోవడం లేదు. వారం రోజుల్లో ఇసుక కొరతను తీర్చి.. కూలీల సమస్యను పరిష్కరించాలని… ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో ఇసుక సత్యాగ్రహం చేసిన.. ఏపీ బీజేపీ నేతలు ఈ మేరకు.. జగన్ సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. ఇసుక వారోత్సవాలు జరిపి సమస్యను పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఇంత వరకూ ఉలుకూ పలుకు లేదనిఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. వారం రోజుల్లో ఇసుక సమస్య తీరుస్తామన్న ప్రభుత్వం… తేదీ, నెల, సంవత్సరం చెబితే మంచిదనిసెటైర్ వేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకుండా… రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని.. బీజేపీ నేతలు మండిపడ్డారు. కృష్ణా, గోదావరిలో వరదలు వస్తే సీమలో ఇసుక కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఐదు నెలల్లోనే మీ పాలనలో అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయని.. వచ్చే నాలుగన్నరేళ్లు పాలన ఎలా ఉంటుందో తలుచుకుంటుంటే భయమేస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్టినా, బెదిరించినా, జైల్లో పెట్టినా పోరాటం ఆపేది లేదన్నారు. వైసీపీ నేతలు అక్రమ సంపాదన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఇసుక కొరత ఏర్పడటం వల్ల.. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు.
ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనీ సర్క్యూేషన్ పడిపోయిందని.. దీని వల్ల ప్రజల జీవితాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. విజయవాడ ఇసుక సత్యాగ్రహంలో.. బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. ఇసుకపై తామే మొదటి నుంచి పోరాడుతున్నామని.. చెప్పుకొచ్చారు. ఇసుక సమస్యపై పోరాడుతున్న టీడీపీ, జనసేన నేతలపై.. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కానీ బీజేపీ విషయంలో వారు స్పందించే అవకాశం లేదు. బీజేపీ నేతలు ఎన్ని తిట్టినా… స్పందించలేని పరిస్థితి వైసీపీ నేతలది.