ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ, జనసేన మధ్య ముసలం ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడలో జనసేన బలంగా ఉందని.. అనుకున్నారు. అయితే అక్కడ ఒక్కటంటే ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఓటమికి కారణం భారతీయ జనతా పార్టీనేనని.. జనసేన పోస్టుమార్టం నిర్వహించుకుని తేల్చేసింది. జనసేన ఓటమికి బీజేపీనే కారణమని విజయవాడలో జనసేన తరపున అన్నీ తానై వ్యవహరించిన పోతిన మహేష్ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి రాలేదని.. బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు జనసేనను వ్యతిరేకించారని పోతిన మహేష్ వాపోయారు. బీజేపీతో పొత్తు వల్ల గెలిచే స్థానాల్లో కూడా ఓడామని.. అంతే కాక.. బీజేపీ నాయకత్వం జనసేనకు సహకరించలేదని ప్రచారానికి పిలిచినా రాలేదన్నారు. బీజేపీ వాళ్లను ఇక కృష్ణానదిలో కలిపేశామని..ఇది రికార్డు చేస్కోవచ్చని.. ఎవరికి భయపడబోమని పోతిన మహేష్ తేల్చి చెప్పేశారు.
జనసేన నేతల అభిప్రాయాలను.. పోతిన మహేష్ బయట పెట్టారు కానీ.. ఇతర ప్రాంతాల నేతలు సైలెంట్‌గా తమ ఫీడ్ బ్యాక్‌ను హైకమాండ్‌కు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క రోజు ముందుగా తెలంగాణ బీజేపీ నేతలపై విరుచుకుపడటం ద్వారా పవన్ కల్యాణ్… గౌరవం ఉండని చోట… తాను ఉండలేనని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో పవన్ కల్యాణ్‌కు ఎలాంటి పొత్తు లేనట్లే. ఇక ఏపీలో మాత్రం పొత్తు ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు… పవన్ కల్యాణ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉంది. అది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బయటపడింది. బీజేపీతో పొత్తు వల్ల తమకు లాభం ఏమీ రాకపోగా… మైనార్టీ ఓట్లు మైనస్ అవుతున్నాయని.. అవి గుంపగుత్తగా వైసీపీకి పడుతున్నాయన్న అంచనాకు వచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి నాలుగు శాతానికి కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది సాధారణ ఎన్నికల కంటే తక్కువ. అదే సమయంలో సాధారణ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి రెండున్నర శాతం ఓట్లు వచ్చాయి. ఇవన్నీ జనసేన ఓట్లేనని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడింది. అది ఎక్కడి వరకూ వెళ్తుందో అంచనా వేయడం కష్టమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.