“పెట్రోలు బంకుల నుంచి..ఏటీఎంల నుంచి బయటకు వెళ్లే వాళ్లు తిట్టే తిట్లతో పోల్చితే హీరో బాలకృష్ణ తిట్టే తిట్లు ఓ లెక్కా..” ఇదీ నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోక్. బాలకృష్ణతో ముడిపెట్టడం వల్ల దీనికి క్రేజ్ వచ్చి ఉండవచ్చు కానీ… అందులోని విషయంలో మాత్రం అవాస్తవం లేదు. ముఖ్యంగా పెట్రోలు ధరలపై ప్రజాగ్రహం ఓ రేంజ్‌కు చేరుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో.. పదిహేను రోజులకు ఒకసారి ధరలు సవరిస్తే…. రోడ్ల మీదకు వచ్చిన ఆందోళన చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రతీ రోజూ పెంచుకుంటూ పోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను బట్టే అని చెబుతున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గిన రోజు కూడా.. పెంచిన సందర్భాలు చాలా ఉన్నాయి.
యూపీఏ-2 ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగడానికి స్కాములపై జరిగిన ప్రచారం ఎంత కారణమో… పెట్రోల ధరల పెంపు కూడా అంతే కారణం. నిజానికి యూపీఎకు అప్పుడు పరిస్థితులు కలసి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు 120 డాలర్ల దరిదాపులకు వచ్చినా.. పెట్రోల్ లీటర్ కు 70 రూపాయల దరిదాపుల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అదే చాలా ఎక్కువ అని భావించిన జనం… ఓటుతో కొట్టారు. దాంతో కాంగ్రెస్ షెడ్డుకెళ్లిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. పరిస్థితులు కలసి వచ్చాయి. క్రూడాయిల్ ధర… దిగి వచ్చింది. ఓ సమయంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 40 డాలర్లకు కూడా వచ్చింది. ఇప్పుడు 70 డాలర్ల వరకూ ఉంది. అంటే.. 70 శాతం వరకూ అంతర్జాతీయ మార్గెట్లో ధరలు పడిపోయాయి. కానీ దేశీయ మార్కెట్లో.. ప్రజలకు అందే పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 80 దరిదాపులకు వచ్చింది. ప్రజల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం జరుగుతూండటంతో… కేంద్రంపై వ్యతిరేకత పెరుగుతోంది. పెట్రోల్ కొట్టించుకునే ప్రతి ఒక్కరి దృష్టిలో కేంద్రానికి మైలేజ్ పడిపోతోంది.
ప్రజావ్యతిరేకత పెరుగుతున్నా.. కేంద్రం మాత్రం ఎందుకు ముందుకు వెళుతోందన్నదానిపై… బీజేపీ నేతల్లోనే విస్మయం వ్యక్తం అవుతుతోంది. పెట్రో ధరలతోనే ప్రజలు తమను పిండేస్తున్నారన్న భావన ఉంటే.. అది ఓట్ల రూపంలో కచ్చితంగా తేడా కొడుతుంది. ఆ విషయం తెలియనంత… రాజకీయ అమాయకత్వం ప్రధాని నరేంద్రమోదీకి లేదు. అయినా ఏ వ్యూహంతో.. వారు .. పెట్రో ధరలను దింపే ప్రయత్నం చేయకుండా ఉండిపోతున్నారని .. బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. విధానపరమైన నిర్ణయాలు.. ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం పడితే…అంతిమంగా అతి పాలకులకు చేటే చేస్తుంది. కానీ దేశం కోసమే తాము ఇవన్నీ చేస్తున్నామని… ప్రజలు కట్టే పన్నులు దేశం కోసమేనని ప్రజలు నమ్ముతారని బీజేపీ భావిస్తున్నట్లుంది.