బిజెపికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వుండగా అందులో ఇద్దరు రాజమహేంద్రవరంలోనే నివశిస్తున్నారు. పార్టీలో ఈ ఇద్దరి మద్దతుదారులు రెండుగా చీలిపోవడంతో ముఠా తగాదాల్లో తనకీ తెలుగుదేశం పార్టీకి తేడాలేదని బిజెపి చాటిచెబుతోంది. బిజెపి నగర అధ్యక్షునికి తెలియకుండా ఆయన వార్డులో ఎమ్మెల్యే పర్యటించడంతో ముఠాతగాదాలు రోడ్డున పడ్డాయి.
ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అయిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కొన్ని సంవత్సరాల క్రితమే పార్టీలో చేరిన వారు. ఆర్ ఎస్ ఎస్ లో వుండే సాంప్రదాయికమైన నిరాడంబరత, గాంభీర్యాలు డాక్టర్ ఆకుల బిజెపిలో చేరాక సడలిపోయాయి. శాసనసభ ఎన్నికల్లో, తరువాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నుంచి హడావిడి, పటాటోపమూ కనిపించాయి. ఈ జోష్ ప్రజల్ని ఆకర్షించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో యువనాయకులైన బొమ్మల దత్తు, క్షత్రియ బాల సుబ్రమణ్యం సింగ్ లు సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంలో బిజెపి ఉనికి ని బాగా ప్రజెంట్ చేయగలిగారు.
జాతీయకార్యవర్గ సభ్యుడిగా సోము వీర్రాజు పాత్ర రాజమహేంద్రవరానికి మాత్రమే పరిమితం కాదు. డాక్టర్ ఆకుల ఫోకస్ ఎమ్మెల్యేగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం! తనదైన స్ధానాన్ని మిత్రపక్షం నుంచి డాక్టర్ ఆకుల ఆక్రమించేసుకున్నారన్న కష్టం తెలుగుదేశం సీనియర్ నాయకుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వుంది. ఆయనకు ధీటైన పటాటోపాన్ని చూపించవలసిన క్రమంలో డాక్టర్ ఆకులకు సహచరుల బలగంతోడైంది. ఇదంతా ఆయన వెనుక గ్రూప్ గా మారింది. బాల సుబ్రమణ్యం సింగ్ వీరిలో ముఖ్యుడు. ఈయన నగర బిజెపి అధ్యక్షపదవిని ఆశించగా అది బొమ్మల దత్తు కైవసమైంది. దత్తు సాన్నిహిత్యం సోము వీర్రాజుతోనే…
ప్రజలు తమ సమస్యల వినతి పత్రాలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కార్యాలయాల వద్ద కిక్కిరిసే వుంటారు. ఆ ఇద్దరూ పిటీషన్లను ఎండార్సు చేసినా ఫాలో అప్ చేసేది ప్రధాన అనుచరులే!
పార్టీ విస్తరణలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలను బిజెపి చేస్తోంది. తన నియోజకవర్గ పరిధిలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఎమ్మెల్యేకు స్వేచ్చ, హక్కు, అధికారమూ వున్నాయి. అయితే, పార్టీ నగర అధ్యక్షునికి తెలియజేయడం అన్నది సమన్వయ పూర్వకమైన సాంప్రదాయం…దీన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ, పార్టీ నగర అధ్యక్షుడైన బొమ్మల దత్తు డివిజన్ లో పర్యటనను కూడా దత్తుకి తెలియజేయలేదని ఆవర్గం మండిపడుతోంది.
వర్గాల పోరు రోడ్డున పడినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మౌనంగా వుండడాన్ని బట్టి నాయకులు ఇద్దరూ వారి వారి వర్గాల వాదనకే కట్టుబడి వున్నారని స్పష్టమైపోతోంది.
ఇది పార్టీ అంతర్గత వ్యవహారమే కావచ్చు. అయితే ఒక అధికార పార్టీలో ముఖ్యనాయకుల మధ్య మాటలే లేవంటే వారు పార్టీని ఎలా సమన్వయం చేస్తారు? కార్యకర్తలకు ఏ సందేశం ఇస్తున్నారు? ప్రజల సమస్యలను ఎలా ఎవరు పరిష్కరిస్తారు అన్నవే అసలు ప్రశ్నలు!