ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారనే తాజా సర్వే ఫలితం కమలనాథులకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. విదేశీ పర్యటనలు అతి కావడం, నల్లధనాన్ని వెనక్కి తీసుకు రాకపోవడం, అసహనంపై దుమారం, అవార్డ్ వాపసీ, ఢిల్లీ, బీహార్ లలో బీజేపీ ఓటమి వంటి కారణాలతో మోడీ ప్రభ మసకబారుతోందని మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచే వారి సంఖ్యా కూడా పెరిగినట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మోడీపై ప్రజల్లో ఇంకా విశ్వాసం సడలలేదని ఓ సర్వే వెల్లడించడం బీజేపీకి టానిక్ లా పనిచేస్తుంది. అయితే, అదే సమయంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రజలు తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వీటిని కూడా కమలనాథులు గుణపాఠంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 301 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-నీల్సన్ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది 339 సీట్లతో పోలిస్తే కొన్ని తగ్గుతాయి. అయితే, మోడీ హవా తగ్గిందనే వార్తలతో ఆందోళన చెందుతున్న బీజేపీకి ఇది శుభవార్తే. అయితే కాంగ్రెస్ పార్టీ సీట్లు భారీగా పెరుగుతాయట. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే సీట్లు 62 నుంచి 108కి పెరుగుతాయని సర్వే తేల్చింది. ఇక, ఉత్తర భారతంలో ఎన్డీయే 19 సీట్లను కోల్పోతుందట. యూపీఏ 12 సీట్లను అదనంగా గెల్చుకుంటుందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దక్షిణాదిలో ఎన్డీయే సీట్లు 41 నుంచి 50కి పెరుగుతాయట. యూపీఏ మాత్రం దక్షిణాదిన 4 సీట్లను నష్టపోతుందట. బీజేపీ 43 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 14 శాతం ఓట్లే పొందుతుందట.
పఠాన్ కోట్ దాడి తర్వాత భారత్ ఇక చర్చల కోసం కాలయాపన చేయవద్దనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. పాకిస్తాన్ పై భారత్ నేరుగా దాడిచేయాలని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దాద్రీ ఘటనపై మోడీ సరిగా స్పందించలేదని 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది మోడీకి దిశానిర్దేశం చేసే విషయం. నల్లధనం విషయంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని 41 శాతం మంది చెప్పారు. అదేమీ లేదని 43 శాతం మంది చెప్పడం విశేషం. బీజేపీ మద్దతుదారుల్లో కూడా 41 శాతం మంది ఈ విషయంలో మోడీ ఫెయిలయ్యారని చెప్పడం మరో విశేషం.
సర్వే ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. హటాత్తుగా ఆయన లాహోర్ వెళ్లడంపై పలువురు విమర్శలు చేశారు. మిత్ర పక్షం శివసేన కూడా అసంతృప్తి వెలిబుచ్చింది. అయితే, అది సరైన నిర్ణయమే అని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం సరికాదని 35 శాతం మంది చెప్పారు. పఠాన్ కోట్ దాడిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు మాత్రం సరిగా లేదనే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇంకాస్త మెరుగ్గా కౌంటర్ అటాక్ ప్లాన్ చేయాల్సిందని 36 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం బాగానే స్పందించిందని 32 శాతం మంది చెప్పారు.
ప్రధాని మోడీ పనితీరు సంతృప్తికరంగా ఉందని 54 శాతం మంది చెప్పారు. ఆయన పనితీరు చాలా బాగుందని 17 శాతం, బాగుందని 37 శాతం మంది చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ పనితీరు బాగుందని 46 శాతం మంది చెప్పారు. మోడీ చెప్పిన మంచి రోజులు వచ్చాయని 42 శాతం మంది చెప్పగా, రాలేదని 50 శాతం మంది చెప్పారు. అయితే, ఆయన పనితీరు ఆశావహంగా ఉందనే ఎక్కువ మంది అభిప్రాయపడటం విశేషం.
దేశంలో ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రధాని మోడీయే అని 32 శాతం చెప్పడం మరో విశేషం. 23 శాతం మంది ఇందిరా గాంధీకి, 21 శాతం మంది వాజ్ పేయికి ఓటు వేశారు. ప్రజాదరణ విషయంలో మోడీకి 58 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి 11 శాతం ఓట్లు దక్కాయి. సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ కు చెరి 4 శాతం ఓట్లు వచ్చాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందని 48 శాతం మంది మెచ్చుకున్నారు. అదేం లేదని 41 శాతం మంది పెదవి విరిచారు. మోడీ హయాంలో విదేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయని కూడా మెజారిటీ ప్రజలు కితాబిచ్చారు. మొత్తం మీద, మోడీ ప్రభుత్వంలో విజయాలు, వైఫల్యాలు ఉన్నాయని సర్వే ఫలితం తేల్చింది. అయితే, దేశాన్ని మోడీ వేగంగా అభివృద్ధి చేస్తారని ఇప్పటికీ ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఏమేరకు నిలబెట్టుకుంటారో, ఘన విజయాలు సాధిస్తారో లేక వైఫల్యాల బాట పడతారో వేచి చూద్దాం.