ఏపీ భాజపా నాయకుడు కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడారు. సందర్భం ఏముందీ అంటే… గతవారంలో టీడీపీ ఎంపీలతో కలిసి భాజపా నేతలు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు కదా! దాని ఫాలో అప్ అనుకోవచ్చు. గతవారంలో ఢిల్లీలో భేటీ జరిగితే ఇప్పుడా మాట్లాడేది అనే ప్రశ్న పక్కన పెట్టేస్తే… కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా అనే అంశం చర్చలోనే లేదని హరిబాబు చెప్పారు. హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో రూపొందించారనీ, దానికి అనుగుణంగా ఏపీకి నిధులు ఇవ్వాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని హరిబాబు చెప్పారు. ఏపీకి రావాల్సిన సాయం విషయంలో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కేంద్రం నిర్ణయించిందని అన్నారు. రైల్వేజోన్ విషయమై కూడా త్వరలోనే కేంద్రం ఆలోచించే దిశలో ఉందన్నారు. ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల గురించి కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆయనకు చెప్పినట్టు వివరించారు.
హరిబాబు చెప్పిన కీలకాంశాలు ఇవే..! నిజానికి వీటిల్లో కొత్త విషయాలు ఏవైనా ఉన్నాయా…? కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా ప్రస్థావన ఉండదు… ఎందుకంటే, దానికి బదులుగా ప్యాకేజీ ఎప్పుడో ప్రకటించారు కదా! అందులో కొత్తదనం ఏముంది..? సరే, రైల్వే జోన్ గురించి కేంద్రం ఆలోచిస్తోందని చెప్పారు. గడచిన మూడున్నరేళ్లుగా అదే పనిలో కేంద్రం ఉంది కదా! వారు ఏమి ఆలోచిస్తున్నారో.. వారి ఆలోచనలు వీరికి ఏమి అర్థమౌతున్నాయో అనేది బ్రహ్మపదార్థం..! ఇక, ప్రాజెక్టుల విషయమై సాయం కోసం రాష్ట్రం వివరిస్తోందట.. కేంద్రం వింటోందట! ఇదేంటో మరి..? ఏపీ భాజపా నేతల తీరు ఎలా ఉందంటే… కేంద్రంలోని తమ పార్టీకి వత్తాసు పలకడమే తప్ప, ఆంధ్రాకు అవసరమైన కార్యక్రమాల విషయమై ఇక్కడి ప్రజల గోడు వీరికి అక్కర్లేదు.
రైల్వే జోన్ ఎందుకు ఆలస్యమౌతోందో అనేది ఏపీ భాజపా నేతలకు క్లారిటీ లేదు. అయితే, ఓపక్క ఒడిశా లాబీయింగ్ బలంగా అడ్డుకుంటోంది కాబట్టి.. విశాఖ జోన్ నిర్ణయంపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో ఉంది. ఎందుకంటే, ఒడిశాలో భాజపా గెలవాలి. ఆంధ్రాకి రైల్వేజోన్ ఇచ్చేస్తే వారి ఆదాయం దగ్గితే.. అక్కడ ఓట్ల పడవేమో అనే టెన్షన్. మరి, ఒడిశా నేతలు అంత లాబీయింగ్ చేస్తుంటే… ఏపీ భాజపా నేతలు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్నకు హరిబాబు దగ్గర సమాధానం ఉండదు..! ప్రత్యేక ప్యాకేజీ విషయానికొస్తే… ఇంకెప్పుడు ఆ నిధులను విడుదల చేస్తారూ అనే ప్రశ్న వీరు కేంద్రాన్నీ అడగరు, రాష్ట్ర ప్రజలకూ వీరు జవాబు చెప్పలేరు! ఎంతసేపూ తమకు పదవులు దక్కలేదనీ, లేదా తమకు దక్కాల్సిన ఖ్యాతిని సీఎం చంద్రబాబు హైజాక్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసుకోవడంలోనే ఏపీ భాజపా నేతల పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, రాష్ట్రంలో క్రియాశీలంగా లేని భాజపా నేతలు బహుశా వేరే చోట్ల కనిపించరేమో..!