పార్టీ ఫిరాయింపులపై బీజేపీ టోన్ మారింది. మొన్నటి వరకు పార్టీ ఫిరాయింపులపై మౌనం వహించిన బీజేపీ అనూహ్యంగా ఉప ఎన్నికలను డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు ఏ విషయంలోనూ కోరస్ ఇవ్వని బీజేపీ ఇప్పుడు పార్టు ఫిరాయింపుల విషయంలో సపోర్ట్ చేస్తుండటం సంచలనంగా మారింది.
పార్టీ ఫిరాయింపులపై మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న బీజేపీ.. కేవలం ఖైరతాబాద్ విషయంలోనే ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. ఎవరైనా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే మాత్రం పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలని కండిషన్ పెట్టింది. ఇటు పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ దూకుడు పెంచిన నేపథ్యంలో… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ ను బీజేపీ డిమాండ్ చేయడం సరికొత్త చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ కు కొన్ని అంశాల్లో బీజేపీ మద్దతు తప్పనిసరి అని భావిస్తుండగా.. బీజేపీకి రాజ్యసభలో బలం లేకపోవడంతో బీఆర్ఎస్ లాంటి తటస్థ పార్టీల సపోర్ట్ కావాల్సి ఉంది. ఇటు బీజేపీ మైత్రి కోసం బీఆర్ఎస్ పాకులడుతోంది అన్న ప్రచారం జరుగుతోన్న వేళ .. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.