బెంగాల్లో రాజకీయ హింస జరిగి రెండు పార్టీల కార్యకర్తలు దాడులు.. హత్యలకు దిగితే.. ఇక రాష్ట్రపతి పాలనే అన్నట్లుగా అక్కడి గవర్నర్ హడావుడి చేశారు. కేంద్ర హోంశాఖ హుటాహుటిన స్పందించి నివేదికలు పంపాలని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత కల్పించారు. అంత కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నా.. ఇక్కడి గవర్నర్కు నోరు పెగలడం లేదు. అసలు ఏం జరుగుతుందో.. ఆయన కనీసం నివేదిక కూడా తెప్పించుకుంటున్నట్లుగా లేరు. కోర్టుల్ని గౌరవించకపోయినా.. ఆదేశాల్ని పాటించకపోయినా.. మౌనం పాటిస్తున్నారు.
ఓ ఎంపీ విషయంలో ఇంత దారుణంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా… రాజకీయ వేధింపుల లక్ష్యంగానే రఘురామరాజును సీఐడీ టార్గెట్ చేసిందని.. తెలుస్తున్నా.. గవర్నర్ మాత్రం.. నోరు మెదపడం లేదు. కేంద్ర హోంశాఖకు లేఖలు రాసినా స్పందన లేదు. కస్టడీలోకి తీసుకుని ఓ ఎంపీని కొట్టడం అంటే.. స్వతంత్ర భారతావని చరిత్రలో ఇంత వరకూ ఇలాంటి ఘటన జరగలేదని.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి… కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. ప్రభుత్వ అధీనంలో ఉండే… ప్రభుత్వం నియంచిన సూపరింటెండెంట్… ప్రభుత్వం కోరినట్లుగానే మెడికల్ రిపోర్ట్ ఇస్తారు.. కాళ్లు వాచాయి. .. రంగు మారాయి.. కానీ కొట్టిన గాయాలు కాదని.. వైద్యులు ఎలా నివేదిక ఇచ్చారో కానీ.. ఆ నివేదికే హాస్యస్పదమవుతోంది.
ఏపీలో రాజ్యాంగ పాలన లేదని.. తక్షణం విచారణ జరిపి.. రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు…. అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో అంటే.. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో ఉంటే.. మాత్రం పరిస్థితి వేరుగా ఉండేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగం.. చట్టం.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం అంటే నియంతృత్వం వైపు వేగంగా అడుగులు వేయడమే.