సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఫెయిలయ్యాడని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, ఆరెస్సెస్ తరపున ఏపీ వ్యవహారాలు చూసుకోవడానికి కొత్తగా నియమితులైన పరిశీలకుడు.. పార్టీ పరిస్థితిని అంచనా వేసి.. హైకమాండ్‌కు నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు నేతృత్వంలో కొన ఊపిరితో ఉన్న పార్టీ … మరింత అవసాన దశకు చేరిందని.. నాయకత్వాన్ని మార్చకపోతే.. మొత్తానికే మోసం వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో హైకమాండ్ ప్రత్యమ్నాయాలను పరిశీలిస్తోంది.
కడప జిల్లాకు చెందిన మాజా మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇటీవలి కాలంలో రాయలసీమ ప్రాంతానికి బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు. అందుకే.. ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతో.. ఆదినారాయణ రెడ్డిని షార్ట్ లిస్ట్ చేశారని చెబుతున్నారు. అయితే ఆయన స్వతహాగా బీజేపీ నేత కాదు. గత ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో రక్షణ భయంతోనే బీజేపీలో చేరారు. ఆయనకు బాధ్యతలిస్తే ఎలా అన్న చర్చ సంప్రదాయ బీజేపీ నేతల్లో నడుస్తోంది. అందుకే… మరో ఆప్షన్‌గా..మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పేరును రెడీ చేసుకున్నారు.
కన్నా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు.. పార్టీ చురుగ్గా పని చేసింది. ప్రభుత్వ అవినీతిపై పోరాడింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి విజయసాయిరెడ్డి వంటి నేతలు ఆయపనపై ఎన్నో ఆరోపణలు చేసేవారు. అయితే అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ కన్నాను తొలగించి సోము వీర్రాజుకు పదవి అప్పగించారు. అప్పట్నుంచి బీజేపీ పని.. ప్రతిపక్ష టీడీపీపై పోరాడటమే కానీ…ప్రభుత్వంపై పోరాడిందేమీ లేదు. చివరికి అది పార్టీకి చేటు చేస్తుందని గుర్తించి..మళ్లీ కన్నా వైపు హైకమాండ్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సోము వీర్రాజుకు ఈ మేరకు సంకేతాలు అందాయని..ఆందుకే ఆయన సైలెంటయిపోయారన్న చర్చ జరుగుతోంది. వారంలో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందంటున్నారు.