భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో… కార్యాచరణ ప్రారంభించేసిన సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా.. జరుగుతున్న పరిణామాలతోనే ఇది నిరూపితమవుతోంది. మొదట.. ఆలయాల్లో అన్యమతస్తుల పేరుతో… బీజేపీ కలకలం రేపింది. శ్రీశైలంలో గత నాలుగు రోజుల నుంచి ఉద్రిక్తంగానే ఉంది. తాజాగా.. జగన్ కు హిందూ విశ్వాసాల పట్ల నమ్మకం లేని చెప్పేందుకు అమెరికాలోని.. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమ ఆరంభ సూచికగా వెలిగించాల్సిన దీపాన్ని వెలిగించకపోవడాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నేతలంతా.. మూకుమ్మడిగా.. సోమవారం… డల్లాస్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ముద్రవేసేందుకు…ముందడుగు వేశారు.
జగన్ క్రిస్టియన్ కాబట్టే హిందూ రాజకీయాలు సులువనుకుంటున్న బీజేపీ..!
జగన్మోహన్ రెడ్డి పక్కా క్రిస్టియన్. ఆయనకు హిందూ విశ్వాసాల పట్ల ఏ మాత్రం నమ్మకం లేదు. ఆయన జీసస్‌ను మాత్రమే నమ్ముతారు. ఈ విషయం… సామాన్యులకు కూడా తెలుసు. ఆయన ధోతీ కట్టుకున్నా… యాగాల్లో పాల్గొన్నా.. స్వాముల కాళ్లకు నమస్కారం చేసినా.., అదంతా.. రాజకీయ అవసరాల కోసమేనని… వైసీపీ నేతలకూ తెలుసు. అయితే.. మత స్వేచ్చ అనేది.. అందరితో పాటు జగన్ కూ ఉంటుంది. ఆయన క్రిస్టియానిటీని పాటిస్తారు కాబట్టి.. వ్యతిరేకించాలనే విధానాన్ని ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పాటించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ వేరు. ఆ పార్టీ రాజకీయాలు వేరు. ఆ పార్టీ హిందూత్వ బ్రాండ్ తమదే అనుకుంటుంది. ఈ హిందూత్వ బ్రాండ్ కూడా ప్రత్యేకం. తమకు ప్రత్యర్థులైన వారు.. హిందువులు కాకపోతే.. వారు చేసే ప్రతి పనిలోనూ.., ఇలాంటి తప్పులు వెదికి.. హైలెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ దృష్టి పెట్టింది.
మద్దతిచ్చి గెలిపించామంటున్నారుగా… అప్పుడు తెలీలేదా..?
జగన్మోహన్ రెడ్డి హిందువు కాదనే విషయం… బీజేపీకి ఇప్పుడే తెలిసిందా..? ఆయన హిందూ సంప్రదాయాలు పాటించరని.. ఇప్పుడే బీజేపీ నేతలు తెలుసుకున్నారా..? అంటే.. అందరూ నోరెళ్లబెట్టక తప్పదు. తెలుగుదేశం పార్టీ… ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది కాబట్టి.. చంద్రబాబునాయుడు మోడీని ధిక్కరించారు కాబట్టి… క్రిస్టియన్ నేత అయినప్పటికీ.., జగన్మోహన్ రెడ్డి.. అమితంగా ప్రొత్సహించారు. టీడీపీ సర్కార్ ను ఎంత ఇబ్బంది పెట్టాలో.. అంతా పెట్టారు. చివరికి.. ఎన్నికల్లోనూ.. వైసీపీకి మద్దతుగా.. బీజేపీ నేతలు పని చేశారు. ఎంతలా అంటే.. ఇప్పుడు.. తమకు రావాల్సిన ఇరవై శాతం ఓట్లు.. వైసీపీకే పడ్డాయని.. కన్నా లక్ష్మినారాయణ, మాధవ్ లాంటి నేతలు.. అప్పుడప్పుడూ గొణుక్కుంటూనే ఉంటారు. అంతగా మద్దతు ఇచ్చినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడనే విషయం బీజేపీకి గుర్తు లేదా.. అనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి.
ముందు ముందు ఏపీలోనూ మత రాజకీయాలేనా..?
క్రిస్టియన్ కాబట్టి.. ఆయనపై తమ మార్క్ రాజకీయంతో.. బలపడవచ్చన్న ఉద్దేశంతోనే.. బీజేపీ ఆయనకు గతంలో సపోర్ట్ చేసిందనే అభిప్రాయం ఉంది. అలాగే.. చేసి. ఇప్పుడు.. మెల్లగా జగన్ పై… మత రాజకీయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు చర్చిల గురించి మాట్లాడుతున్నారు. వాటికి భద్రత కల్పించడమేమిటంటున్నారు. ఆలయాల్లో హిందూవేతలు ఎక్కువైపోయారని రచ్చ ప్రారంభించారు. ఇప్పుడు జగన్.. హిందూ సంప్రదాయాలు పాటించరంటూ.. కొత్తగా వివాదం ప్రారంభించారు. ముందు ముందు ఇలాంటి పొలిటికల్ స్కిట్స్ చాలా వచ్చే అవకాశం ఉంది.