ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 6న ఆంధ్రా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ విడిపోయిన తరువాత ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. అంతేకాదు, విభజన చట్టంలోని అంశాల అమలుతోపాటు, ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం సాధ్యం కాదని పదేపదే చెప్పిన తరువాత రాబోతున్నారు. దీంతో రాజకీయంగా మోడీ ఆంధ్రా పర్యటన కొంత ఆసక్తికరంగా మారింది. ‘కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేశారు. మళ్లీ, ఇక్కడికి (ఆంధ్రాకి) ప్రధానమంత్రి వస్తానంటున్నారు. అంటే… మనం బతికున్నామా చచ్చామా అని చూడ్దానికి వస్తారా మీరు? ఎందుకు చేయరు ఇవన్నీ?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా స్పందించారు.
ఇక, మోడీ పర్యటన నేపథ్యంలో భాజపా శ్రేణుల నుంచి వేరే అభిప్రాయం వినిపిస్తోంది. భాజపా అనుబంధ విభాగాలకు చెందిన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది! ఆంధ్రాలో జనవరి ఆరు తరువాత అసలు లెక్కలు తేలబోతున్నాయనీ, అసలు రంగు బయటపడుతుందంటూ ఒక అభిప్రాయం భాజపా శ్రేణుల్లో చర్చనీయం అవుతున్నట్టు సమాచారం. ఇంతకీ అసలు రంగు అంటే ఏంటట..? ఈ మధ్య ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలను చూస్తూ… వరుసగా ఐటీ అధికారులు కొన్ని నగరాల్లో అనహ్య దాడులు చేశారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన అకౌంట్లు, లావాదేవీలపై ఏవో కూపీలు లాగారు. రికార్డులు పట్టుకెళ్లారు! తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్నవారిని లక్ష్యంగా చేసుకునే సాగిన దాడులే ఇవి అంటూ ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. దీన్నొక రాజకీయ కక్ష సాధింపు చర్యగానే టీడీపీ చూసింది.
ఆ సమయంలో తీసుకెళ్లిన లెక్కా పత్రాలపై ఇంతవరకూ పెద్ద ఎత్తున చర్యలంటూ ఏవీ జరగలేదు. మరి, ఆరు తరువాత అనూహ్య పరిణామాలంటే… వాటి ఆధారంగా ఎవరిపైన అయినా చర్యలుంటాయా, అరెస్టుల వరకూ పరిణామాలు వెళ్తాయా అనే అనుమానాలకు తావిచ్చేలా ఈ వాతావరణం కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే… ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా, ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన చర్చ భాజపాలో జరుగుతున్నట్టుగా ఊహాగానాలు బయటకి రావడం లేదు. ఇలాంటి కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అంతేగానీ, మోడీ వస్తే హోదాపై స్పష్టత ఇప్పిస్తామనిగానీ, విశాఖ రైల్వేజోన్ గురించి మాట్లాడాలని కోరతామనిగానీ… ఈ తరహా చర్చ అనేదే భాజపాలో జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ప్రధాని వచ్చి వెళ్లాక రాజకీయ ప్రేరేపిత దాడులు పెరుగుతాయనే సంకేతాలు వస్తుండటం విచారకం.