తెలంగాణలో సోలోగా బలపడేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారనీ, భాజపా స్ట్రాటజీ టీమ్ ఇప్పటికే తెలంగాణపై అధ్యయనం మొదలుపెట్టిందనీ ఆ మధ్య కథనాలొచ్చాయి. టి. భాజపా నేతలు కూడా కేసీఆర్ సర్కారును విమర్శించే ఏ ఛాన్సునూ వదులుకోవడం లేదు. ప్రతీ చిన్న అవకాశాన్నీ పార్టీ బలపడేందుకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో మూడు రోజుల పర్యటన కోసం తెలంగాణకు రానున్నారు. ఆ పర్యటనపై ఇప్పట్నుంచే పొలిటికల్ హైప్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు.
అమిత్ షా పర్యటనకు వస్తున్నారని తెలిసిన దగ్గర నుంచీ తెరాస నేతలకు టెన్షన్ మొదలైందని వ్యాఖ్యానించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్. భాజపా సభ ఉందని తెలియగానే తెరాస నేతలు ఉలికిపడుతున్నారని అన్నారు. తెలంగాణలో మోడీ హవా మొదలైందనీ, కేసీఆర్ బాహుబలి అయితే తమకు మోడీ అనే బ్రహ్మాస్త్రం ఉందని లక్షణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భాజపాతోనే అసలైన పోటీ ఉంటుందని తెరాస భయపడుతోందన్నారు. దేశం ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా జయకేతనం ఎగరేస్తోందనీ, ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోతున్నాయని ఆయన చెప్పారు. కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
అమిత్ షా పర్యటనపై ఫోకస్ పెంచాలన్న వ్యూహమే లక్ష్మణ్ వ్యాఖ్యల్లో ధ్వనిస్తోంది. తెరాస నిర్వహించిన వరంగల్ సభకు ధీటుగా అమిత్ షా పర్యటన ఉండాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! ఈ పర్యటనకు ప్రాధాన్యత పెంచాలంటే… దీని గురించి తెరాస కూడా మాట్లాడేట్టు చేయాలి. అందుకే, తెరాసపై ఇలా విమర్శలకు దిగుతున్నారు. ఈ విమర్శలకు కౌంటర్ గా ఎవరో ఒక తెరాస నేత స్పందిస్తారు కదా! దానికి కొనసాగింపుగా భాజపా మరో కౌంటర్ వేస్తుంది. సో.. అమిత్ షా పర్యటన గురించి ఏదో ఒక కామెంట్ వార్తల్లో ఉంటుంది. అలా ఈ పర్యటనకు ప్రాధాన్యతన పెంచాలన్నది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది.
నిజానికి, ఈ మధ్య తెరాసపై భాజపా విమర్శల స్వరం పెంచింది. వీటిపై కేసీఆర్ సూటిగా స్పందించడం లేదు! వరంగల్ సభలో కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు, దద్దమ్మలూ సన్నాసులూ అంటూ వారినే టార్గెట్ చేసుకున్నారు. అంతే తప్ప భాజపా గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడాల్సిన పరిస్థితిని భాజపా నేతలు క్రియేట్ చేస్తున్నారు. మరి, కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.