ఉత్తరాది నుంచి దిగ్గజ నేతలొస్తున్నారు. వాళ్ల సమక్షంలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయి. ఎవరు చేరబోతున్నారో చివరి క్షణాల్లో తెలుస్తుంది. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు.. అంటూ.. గత కొద్ది రోజులుగా.. ఏపీ బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారు. చివరికి నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా అదే చెప్పారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో… చేరికల కోసం.. టీడీపీ క్యాడర్ అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోందని… విజయవాడలో ఘనంగా ప్రకటించుకున్నారు. ఎవరెవరు చేరబోతున్నారో మీరే చూస్తారుగా.. అంటూ.. సస్పెన్స్ క్రియేట్ చేశారు. నిజమే కాబోలనుకున్నారు. తీరా చూస్తే… కొద్ది రోజుల కిందట.. టీడీపీకి రాజీనామా చేసిన చందు సాంబశివరావు అనే నేతతో పాటు.. రాజకీయాల నుంచి విరమించుకున్న మరికొంత మంది పాత నేతల్ని తీసుకొచ్చి కండువా కప్పారు. బీజేపీలో చేరిన నేతల్ని.. అంతకు ముందు.. వారు చేసిన హడావుడిని చూసి.. బీజేపీ ఓ మాదిరి నేతలు కూడా నవ్వుకోవాల్సి వచ్చింది.
ఏపీలో అమాంతంగా బలపడిపోవాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఒక్క శాతం ఓట్లు కూడా రాకపోయినప్పటికీ.. ఇక ఏపీకి తామే దిక్కన్నట్లుగా వారు కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో.. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని హైప్ క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ నేతల్లో ఓ అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి… అందర్నీ తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం.. అన్ని మార్గాలనూ.. వారు అన్వేషించుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు ఈజీగా పడిపోయారు కానీ.. మిగతా నేతలు మాత్రం.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుంటున్నారు.
బీజేపీలో చేరిక వ్యవహారాల్ని ఢిల్లీ నుంచి చక్క బెడుతున్నారు. జిల్లాల వారీగా జాబితా తీసుకుని ఆఫర్లు ఇస్తున్నారు. ఈ ఆఫర్లు కూడా.. వారిని భయభక్తులతో స్పందించేలా చేస్తున్నారు. రక్షణ కావాలంటే.. బీజేపీలో చేరక తప్పదన్నట్లుగా ప్రచారం ఉండటంతో.. కొంత మంది చేరారు. మరికొంత మంది మాత్రం.. రక్షణ కోసం ఇప్పుడు చేరితే.. తర్వాత రాజకీయ భవిష్యత్ లేకుండాపోతుందని భయపడుతున్నారు. టీడీపీ వేరే నేతల్ని తయారు చేసుకుంటే.. తమ పరిస్థితేమిటని వారి భయం. అందుకే.. బీజేపీతో టచ్‌లో ఉంటున్నారు కానీ.. చేరికలు మాత్రం వాయిదా వేస్తున్నారు. ఆ ప్రభావం.. విజయవాడ బీజేపీ సభలో స్పష్టంగా కనిపించింది.