ఏడాది కిందట కర్ణాటకలో ఏం జరిగిందో.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అదే జరగబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమిని ఎలా కూలగొట్టి.. బీజేపీ పదవి చేపట్టిందో.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌నూ అలాగే బీజేపీ కూలగొట్టబోతోంది. మధ్యప్రదేశ్ బీజేపీ కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా వర్గం అంతా.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. మొత్తం ఇరవై మంది ఇలా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. దీంతో.. కమల్ నాథ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. రాజీనామాలు చేసిన తర్వాత ఉన్న బలాబలాలతో పోలిస్తే.. బీజేపీకే ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు బలపరీక్ష అంటూ జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలడం.. వెంటనే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం.
ఆ వెంటనే రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉపఎన్నికల్లో కర్ణాటకలో మాదిరిగా గెలిపించుకుని మంత్రి పదవులు కట్టబెడతారు. రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా వర్గీయుల్లో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరు తిరుగుబాటు చేస్తున్నారని తెలియగానే.. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆ ఆరుగురు మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా గవర్నర్‌కు లేఖ పంపారు. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ నేతగా మారుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. జ్యోతిరాదిత్య .. తాను కాంగ్రెస్‌లో ఉంటే.. ప్రజాసేవ చేయలేనని … చెప్పి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరడం.. రాజ్యసభకు వెళ్లడం.. ఖాయమయిందని చెబుతున్నారు.
బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా సీనియర్ నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా.. కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలను ఆకర్షించిన బీజేపీ.. వారందరితో రాజీనామా లు చేయించింది. మెజార్టీ కోల్పోయిన ప్రభుత్వాన్ని కూలగొట్టి మైనార్టీ సర్కార్ ను ఏర్పాటు చేసింది. తర్వాత ఉపఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వారందర్నీ గెలిపించుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అదే జరుగుతోంది. ఎన్నికల్లో కోల్పోయిన రాష్ట్రాలను బీజీపే.. ఇలా ఇతర పద్దతుల్లో చేజిక్కించుకుంటోంది.