మోదీ, షాలను మించిన రాజకీయ నాయకుడు ప్రస్తుతానికి దేశంలో లేరు. ఎవర్ని ఎలా ట్యూన్ చేయాలో వారికి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు. రాజకీయం అంటే ఆలోచన. ఆవేశం కాదు. కనీసం ఆవేశంతో ఆలోచన కూడా చేయకూడదని రాజకీయంలో వారు నిరూపించారు. దీంతో ఏదో జరిగిపోతుందని అనుకున్న వారికి షాకిచ్చారు. తాము అంత ప్రాధాన్యం ఇవ్వబోమని.. మీ రేంజ్ వేరని చేతలతో చెప్పారు.
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ ఒక్క సారిగా గేరు మార్చింది. నేరుగా మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీని ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొట్టేందుకు అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ ప్రయత్నించారు. కేసీఆర్ మోదీ పాలన దరిద్రం అని తిట్టేస్తే .. కేటీఆర్ వాటిని లేఖల రూపంలోకి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక జాతీయకార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ నేతల్ని టీఆర్ఎస్ నేతలు చికాకు పెట్టి నవైన కూడా చిన్నదేమీ లేదు. శుభమా అని తమ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే టీఆర్ఎస్ మొత్తం తన పార్టీ ప్రచారంతో నింపేసుకుంది. చివరికి పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నేతలు మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ బొమ్మలతో బెలూన్లు ఎగురేశారు. ఇది చిల్లరగా అనిపించినా బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
మోదీ నోటి వెంట కేసీఆర్ మాటే రాలేదు. కనీసం విమర్శించలేదు. తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు ఇంత శ్రమ చేసిన ఫలితం దక్కలేదన్న నిరాశకు గురయ్యారు. మోదీ కేసీఆర్ ను తిట్టి ఉంటే.. అది టీఆర్ఎస్ కు క్రేజ్ తెచ్చి పెట్టేది. ఇప్పటివరకూ బీజేపీకి అలాంటి ఊపు తెచ్చామని.. ఖచ్చితంగా తమకూ బూస్ట్ ఇస్తారని టీఆర్ఎస్ నేతలుఅనుకుని ఉండవచ్చు కానీ అలాంటిచాన్స్ లేదని తేల్చేశారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు దిక్కుతోచని పరిస్థితి.
అదే సమయంలో మోదీ మినహా ఇతర నేతలు అమిత్ షా, నడ్డావంటి వారు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ రేంజ్‌కు తాము చాలని అలా చెప్పినట్లయిందని భావిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ విషయంలో బీజేపీ వ్యూహం నెక్ట్స్ లెవల్ అన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.