తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా మరింత బలపరుస్తామంటూ కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది భాజపా. దీన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అంశాలవారీగా కేసీఆర్ సర్కారుపై పోరాటాలు, ఉద్యమాలకు దిగుతామని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెబుతున్నారు. ఇంకోపక్క, సామాజిక సమీకరణాల లెక్కల్ని కూడా భాజపా విశ్లేషించిందనీ, తెలంగాణలో ఎలాగూ హిందుత్వ ట్రంప్ కార్డు వర్కౌట్ కాదనీ, కులాలవారీగానే ఇక్కడా వెళ్లాలనే ఉద్దేశంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీన్లో భాగంగా ఇకపై బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా తెలంగాణలో భాజపా కనిపించాలనేది ప్రయత్నం తీవ్రంగా ప్రారంభించాలనేది తాజా నిర్ణయంగా తెలుస్తోంది.
తెలంగాణలో బీసీలను ఆకర్షించడం కోసం గతంలో టీడీపీ అనుసరించిన విధానాలనే ఇప్పుడు భాజపా కూడా తెరమీదికి తెచ్చే ప్రయత్నంలో ఉంది. నిజానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. అయినా కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు కేడర్ ఇంకా మిగిలుంది. రాష్ట్రంలో దాదాపు సగం ఉన్న బీసీ జనాభాకు గతంలో టీడీపీ చాలా ప్రాధాన్యత ఇచ్చేది. ఇప్పుడు ప్రత్యామ్నయంగా కాంగ్రెస్, తెరాసలు వారికి పెద్దగా కనిపించని పరిస్థితి ఉంది. ఈ స్పేస్ ని ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది తాజా భాజపా వ్యూహం. దీన్లో భాగంగా భాజపా బీసీ అనుకూల పార్టీ అనే ప్రచారం తెర మీదికి తేవాలనీ, ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వర్గాలకు చెందినవారనీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా బీసీల నుంచే వచ్చారనీ, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా బీసీ అనీ, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూడా బీసీ అనీ ఆయనకి గవర్నర్ పోస్ట్ ఇచ్చామనీ… ఇలాంటి ఓ ప్రచారాన్ని త్వరలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున చేయబోతున్నట్టు సమాచారం.
వచ్చే నెలాఖరులోపు టీటీడీపీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలనీ, వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే ప్రకటించారు. తెలంగాణలో మళ్లీ పట్టు పెంచుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెడుతోంది కాబట్టి, ఈలోగానే బీసీలకు సంబంధించి ఈ తరహా ప్రచారాన్ని తెర మీదికి తేవాలన్నది భాజపా వ్యూహంగా తెలుస్తోంది.