ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో … ఆపరేషన్ కూడా అంతే స్మార్ట్ గా.. నిర్వహిస్తున్నట్లుగా.. తరచూ బీజేపీ నేతల వ్యాఖ్యలతో బయట పడుతూనే ఉంది. ఇప్పటికి టీడీపీ నేతలను.. తమ పార్టీలో కలుపుకుంటున్న బీజేపీ.. త్వరలో.. చంద్రబాబును జైలుకు పంపాలనే వ్యూహరచన చేసినట్లుగా… ఢిల్లీలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్.. బహిరంగంగా ప్రకటించి కలకలం రేపారు. కృష్ణా జిల్లాలో.. పురందేశ్వరితో కలిసి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరన్న అంచనాలు మాత్రం రాజకీయవర్గాల్లో ఉన్నాయి.
ఏపీని త్రిపుర చేసినట్లుగా చేస్తామని.. అక్కడ లాగా ఇక్కడ కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని.. బీజేపీ నేతలు అదే పనిగా చెబుతున్నారు. త్రిపుర విషయంలో బీజేపీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం.. సునీల్ ధియోధర్. కొన్నాళ్ల క్రితం సునీల్‌ని బీజేపీ కో ఇన్చార్జ్ గా నియమించారు. మురళీధరన్ అనే ఇంకో నేతను ఇన్చార్జ్ గా నియమించింది. ఇప్పుడు ఈ మురళీధరన్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. దీంతో సునీల్ ప్రధాన ఇన్చార్జ్ అయిపోయారు. సునీల్ దియోదర్ నరేంద్రమోడీకి సన్నిహితుడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్‌గా పని చేశారు. ఈ ఆరెస్సెస్ నేతను గుజరాత్‌లోనూ ఉపయోగించుకున్నారు మోడీ. 2013లో దక్షిణ డిల్లీకి ఇంచార్జ్‌గా ఉన్నారు. 2014లో మహారాష్ట్రలో పని చేశారు.
త్రిపురలో ఉండేది పాతిక లక్షల మంది ఓటర్లు. అక్కడ యాభై వేల మందికిపై ఫుల్ టైమర్లను దింపి.. ఆరు నెలల ముందు నుంచి కార్యాచరణ రెడీ చేసుకున్నారు. ఏపీలో ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రెడీ చేసి.. రాజకీయంగా అనుకున్నది సాధించడానికి భారతీయ జనతా పార్టీ.. సునీల్‌ని దింపిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. టీడీపీ విషయంలో ఓ ప్రణాళిక ప్రకారం.. బీజేపీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపేనాటికి టీడీపీని నిర్వీర్యం చేయాలనే ప్లాన్ కూడా.. ఉండే ఉంటుందని… రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీ నేతల స్టేట్మెంట్లు.. తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి.