హిందూత్వ రాజకీయ వ్యూహంలో భాగంగా బిజెపి, సంఘపరివార్ చేపట్టిన గోసంరక్షణ చినికి చినికి గాలివానగా మారి ఆ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆత్మరక్షణలో పడేసింది.. అందులోనూ దళిత బహుజనులు, అల్ఫ సంఖ్యాకవర్గాలు భయబీభత్సవాలకు గురవుతున్నారు. . ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ఉన్ గ్రామ సమీపాన గోరక్షణ పేరుతో అమాయకులైన దళితులను అమానుషంగా హింసించడం దేశాన్ని కుదిపేసింది.ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, కర్నాటక వంటి చోట్ల ఈ గోరక్షణ పేరిట బయలుదేరిన అరాచక మూకల చర్యలు తీవ్ర పరిస్థితికి దారితీశాయి. చివరకు ఈ గోరక్షణ కమిటీలు అనే వాటిని రద్దు చేయాలనే మాట చాలా చోట్ల నుంచి వినిపిస్తున్నది.గోరక్షణ దళాలు దళిత భక్షణ దళాలుగా మారాయని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిఎల్ పునియా విమర్శించారు.గుజరాత్లో మొత్తం 200లకు పైగా గోరక్షణ దళాలు ఉన్నాయి.గుజరాత్ డిజిపి కూడా గోరక్షణ దళాలు పెద్ద బెడదగా మారాయని విమర్శించారు. ఇవి శాంతి భద్రలకు పెద్ద తలనొప్పిగా మారాయని ప్రభుత్వ కార్యదర్శి జిఆర్ గ్లోరియా ప్రకటించారు. స్థానికంగా ఉండే అవాంచిక శక్తులు అలగా బాపతుల్లో చేరిపోతున్నారని అధికారులు అంటున్నారు. అలాంటి గ్రూపుల వారు కత్తులు, కటారులు పట్టుకుని తిరగడంతో అధికారులు, పోలీసులు నిస్సహయంగా ఉండిపోతున్నారు. మోడి ప్రధాని అయ్యాక ఇలాంటి శక్తులు బాగా పెరిగాయి. పశు వ్యాపారం చేసుకునే వారిపై నుంచి గానీ, కబేళాలు తరలించే వారి నుంచి గానీ ఈ దళాలు భారీగా డబ్బులు గుంజుకుంటున్నాయి. కర్నాటకలో కూడా గోవుల ఆరోపణలపైనే 5 దళితుల కుటుంబాలపైనే దాడి చేశారు.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా ఈ దాడిని ఖండించారు యుపిలోని దాద్రిలో అఖ్లక్ఖాన్ను హత్య చేసింది చాలక ఆ కుటుంబంపైన గోహత్య నేరం మోపాలని ఒత్తిడి చేయడం ఎంత దారుణం? విహెచ్పి, భజరంగ్‌దళ్, గోరక్షణ సమితి వంటి పేర్లతో వాళ్లు నానారకాల గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. అసలు గోరక్షణ నినాదమే దళిత వ్యతిరేకమైంది. కోట్లాదిమంది దళితుల ఉపాధి దానితో ముడిపడి ఉంది. మృతపశువుల చర్మం వొలిచే సంప్రదాయం తరతరాలుగా కోట్ల మంది దళితులు చేస్తున్నదే. అది వారి జీవనోపాధి కూడా. గతంలో ముస్లింలు గొడ్డు మాంసం కోసం చంపుతున్నారని అనే వాళ్లు. ఇప్పుడు చనిపోయిన ఆవులను కూడా అంటుకోరాదనడం దారుణమని పునియా విమర్శించారు. దళితులపై . నేరాల్లో జాతీయంగా సగటున 22శాతం మందికి శిక్షలు పడుతుంటే గుజరాత్లో 2.9శాతం మందికే శిక్షలు పడుతున్నాయి. కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది.. . అసలు వ్యవసాయమే సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుపేద గ్రామీణులు నిరుపయోగంగా ఉన్న కొద్దిపాటి పశువులను ఏంచేయాలన్నది పెద్ద సవాలు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడా వాటిని పోషించడం వృధా భారమని చెబుతున్నారు. ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి సహాయం అందించే ప్రసక్తి లేనప్పుడు ఆత్మహత్యల పాలవుతున్న రైతులను చూడాలా? లేక మరణావస్థలోనే గోవులను నరకప్రాయంగా బతకనివ్వాలా? అని బక్క రైతులు గ్రామీణ పేదలు ప్రశ్నిస్తున్నారు.బహుశా రాబోయే రోజుల్లో ఈ గోరక్షణ పల్లవి వెనక్కు పోతే ఆశ్చర్యం లేదు.