స్వతంత్ర దినోత్సవం అనగానే రాజకీయ పార్టీలన్నీ ఘనంగా జరుపుకుంటాయి. ఈ ఒక్కరోజూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలను పక్కనబెట్టి దేశానికి స్వతంత్రం సాధించిన మహనీయులను స్మరించుకుంటాయి. ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ప్రముఖ నాయకుల ప్రసంగాలన్నీ దాదాపు ఇవే ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఆ ట్రెండ్ కొంచెం మారింది. జెండా ఎగరేసిన తరువాత కొద్దిసేపు మహానీయులను స్మరించుకున్నాక… నేరుగా రాజకీయ ప్రసంగాలకే నాయకులు మారుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగరేశాక రాష్ట్రంలో తెరాస పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. గాంధీభవన్ లో జెండా ఎగరేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… నెహ్రూకి ప్రాధాన్యత తగ్గించేశారనీ, దేశంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయనీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి అంటూ విమర్శలు చేశారు. భాజపా నేతల విషయానికొస్తే… తెలంగాణ విమోచన దినం ప్రస్థావనతోనే స్వతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.
జెండా వందనం అనంతరం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందనీ, వారి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందో లేదో ముందుగా చూసుకోవాలంటే సలహా ఇచ్చారు. మజ్లిస్ పార్టీకి తెరాస మోకరిల్లుతోందనీ, అందుకే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరిపేందుకు కేసీఆర్ ముందుకు రావడం లేదన్నారు. విమోచన దినం అంటే తెరాస భయపడే పరిస్థితిలో ఇప్పుడుందన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామనీ, వచ్చే నెలలో జరిగే విమోచన దినాన్ని పార్టీ తరఫున ఘనంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పారు. సెప్టెంబర్ 17ని జాతీయ పండుగ చేస్తామని భాజపా హామీ ఇస్తోందన్నారు.
విమోచన దినాన్ని ఘనంగా భాజపా నిర్వహించుకోవచ్చు. కానీ, స్వతంత్ర దినోత్సవం నాడు కూడా దాన్నే ప్రముఖంగా ప్రస్థావిస్తూ లక్ష్మణ్ మాట్లాడారు, ఆయన తరువాత మురళీధర్ రావు మాట్లారు, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూడా మాట్లాడారు! సెప్టెంబర్ 17ని పక్కా రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకునే అంశంగా భాజపా మార్చేస్తోంది. ఇదైతేనే తెరాస స్పందించలేదు అనే అన్నట్టుగా విమర్శిస్తోంది. మిగతా దినోత్సవాల కంటే… అదొక్కటే ముఖ్యం అనేట్టుగా భాజపా నేతల ప్రసంగాలున్నాయి.