ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చేసింది. పదవి చేపట్టి పట్టుమని నాలుగు నెలలు కాకుండానే ఆయనను పదవి నుంచి దింపేసి.. కొత్తగా మరొకరికి చాన్సిచ్చింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగాల్సి ఉంది. అయితే ఆయనను దింపేయడానికి కారణం పని తీరు కాదని.. బీజేపీ ప్రచారంలోకి తీసుకు వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోవడమేనని చెప్పుకొస్తోంది. తీరథ్ సింగ్ .. సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఎంపీగా ఉన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఆయన ఎంపీగా రాజీనామా చేయలేదు. ఇప్పటికీ ఎంపీగానే ఉన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో ఎంపిక కావాల్సి ఉంది.ఇంకా రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.
ఉత్తరాంఖండ్‌లో రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేంద్రం అనుకుంటే.. ఇప్పటికిప్పుడు రెండు స్థానాల ఉపఎన్నికలు నిర్వహించ వచ్చు. కానీ.. కరోనా కారణంగా ఇప్పుడల్లా ఎన్నికలు నిర్వహించలేమని.. ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ కారణంతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవలేరని కారణంగా చెప్పి ఆయనను బీజేపీ పెద్దలు తొలగించారు. కానీ.. బీజేపీ తల్చుకుంటే ఆయన పదవిని నిలబెట్టడం పెద్ద విషయం కాదు. రాజ్యాంగంలో దానికి సంబంధించిన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కానీ ఆయనను తప్పించాలనే బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు. దీనికి కారణం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేయడమే అని .. దేశ రాజకీయవర్గాలు ఓ అంచానాకు వస్తున్నాయి. బెంగాల్ ఎన్నికలలో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటికీ.. మమతా బెనర్జీ నందిగ్రాంలో ఓడిపోయారు. ఆమె తన పాత సీటు భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించారు. అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. నవంబర్‌లోపు ఎన్నిక కాకపోతే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగం ప్రకారం.. ఏ సీటు అయినా ఖాళీ అయిన ఆరు నెలల్లో ఉపఎన్నికలు నిర్నహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కరోనా ధర్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించబోరని అంటున్నారు. నవంబర్లోపుఎన్నికలు నిర్వహించకపోతే.. తీరథ్ సింగ్ రాజీనామా చేసినట్లుగా.. మమతా బెనర్జీ కూడా రాజీనామా చేయక తప్పదు. బెంగాల్ కోణంలో … ఎన్నో రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఈ ప్లాన్ కూడా అమలు చేయబోతోందని… అందుకే.. తమ సీఎంను కూడా… త్యాగం చేశామని చెప్పుకోవాలనుకుంటోందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ వర్సెస్ మమతా రాజకీయం… ముందు ముందు మరింత ఘాటుగా సాగే అవకాసం అయితే కనిపిస్తోంది.