కేంద్రమంత్రి నారాయణ స్వామి ఏపీ పర్యటనకు వచ్చి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. దీంతో మళ్లీ ఏపీలో బీజేపీ వ్యూహంపై చర్చ జరుగుతోంది. వైసీపీ కూడా బీజేపీకి దగ్గరగానే ఉంటోంది.
భారతీయ జనతా పార్టీకి రెండు సార్లు ఫుల్ మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్నే కొనసాగిస్తున్నారు. కేబినెట్ లో బీజేపీ మంత్రులే కాకుండా మిత్రపక్షాలకూ అవకాశం కల్పిస్తున్నారు. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ రాను రాను చిక్కిపోయింది. బీజేపీ తప్ప కాస్త బలంగా ఉండే పార్టీ ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ కూటమిని బలోపేతం చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ తో పాటు కలిసి నడిచేందుకు పద్దెనిమిది పార్టీలు రెడీ కావడంతో.. తమ కూటమిలోనూ అంత బలం ఉందని నిరూపించాలని బీజేపీ అనుకుంది. అందుకే దూరమైన మిత్రపక్షాలను కూడా పిలిచి పద్దెనిమిదో తేదీన ఎన్జీఏ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో ఏపీలో ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్న టీడీపీకి కూడా ఆహ్వానం పలికారని జాతీయ చెబుతోంది. అయితే ఈ విషయం లో స్పష్టత లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా తాము ఎన్డీఏలో చేరుతామన్న ఆసక్తిని కనబరుస్తోంది. బయటకు చెప్పడం లేదు కానీ.. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేరకుండా చేయడానికైనా తాము బీజేపీ కూటమిలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా చెప్పారని అంటున్నారు.
ఇటీవల ఓ హిందీ చానల్ లో టీడీపీకి అసలు పార్లమెంట్ సీట్లే రావని.. మొత్తం పాతిక సీట్లూ తమ పార్టీకే వస్తాయని సర్వే వచ్చింది. ఈ సర్వేను బీజేపీ పెద్దలకు చూపించి.. టీడీపీతో పొత్తు వల్ల ఉపయోగం ఉండదని.. తమ వల్లే లాభమని ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే వారి వైపు నుంచి ఎలాంటి స్పందన ఉందన్నది స్పష్టత లేదు. కానీ జాతీయ మీడియాలో మాత్రం టీడీపీనే పిలిచారని అంటున్నారు. చంద్రబాబు ఇటీవల అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. అయితే అంశంపై ఆయన ఎక్కడా మాట్లాడటం లేదు.
ఎన్డీఏ కూటమిలో టీడీపీకి ఆహ్వనం పలికితే వైసీపీ ప్రచారం చేసుకుంటున్న పాతిక సీట్ల సర్వేలను బీజేపీ కామెడీగా తీసుకుంటుందన్నది తేలిపోతుంది. అంటే.. ఫేకింగ్ లో కింగ్లని… బీజేపీ పెద్దలకూ అర్థమైపోతుందన్నమాట.