పవన్ కళ్యాణ్ కి భాజపా ఆహ్వానం…భలే ఉంది ఈ ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ భాజపా యువమోర్చ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసారు. పవన్ కళ్యాణ్ భాజపాలోకి వచ్చినట్లయితే ఆయనకీ సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ఆయన తెలిపారు. ఆ తరువాత ఆయన చెప్పిన మాటలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. తెదేపా-భాజపాల స్నేహం గురించి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అవెప్పుడో తెగిపోయాయని, కేవలం రాష్ట్ర, జాతీయ స్థాయిలో మాత్రం ఇంకా కొనసాగుతోందని అది కూడా ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. తెదేపా నేతలు మిత్రధర్మం పాటించకుండా తమ పార్టీతో, కేంద్రప్రభుత్వంతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనుక వచ్చే ఎన్నికలలో భాజపా ఒంటరిగా పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో భాజపాకి మంచి భవిష్యత్ ఉంది కనుక పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరితే బాగుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత దానితో ఎన్నికలను ఎదుర్కోలేమని గ్రహించి గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసి భాజపాకి మద్దతు తెలిపారు. ఆ తరువాత ఆయన సూచన మేరకు తెదేపాకు కూడా మద్దతు ఇచ్చి, ఆ రెండు పార్టీల తరపున ఎన్నికలలో గట్టిగా ప్రచారం చేసారు. అయితే ఆయన మొదటి నుంచి తెదేపా పట్ల కొంత అయిష్టత వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అది నేటికీ ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
ప్రత్యేక హోదాపై తెదేపా ఎంపిలు నిర్లక్ష్యం వహించారని తెదేపాకి గట్టిగానే చురకలు వేసిన పవన్ కళ్యాణ్, అదే విషయంలో కేంద్రానికి మరికొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని మోడీ ప్రభుత్వం పట్ల మెత్తగా వ్యవహరించడం గమనార్హం. రాజధాని భూసేకరణ, పార్టీ ఫిరాయింపులు వంటి చాలా విషయాలలో ఆయన తెదేపాతో విభేదిస్తున్నప్పటికీ ఎందుకో మౌనం వహిస్తున్నారు. ఆ కారణంగా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది.
పవన్ కళ్యాణ్ తెదేపా కంటే భాజపా పట్ల కొంత సదభిప్రాయం ఉన్నట్లు స్పష్టం అవుతోంది కనుక, విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సూచనను స్వీకరించవచ్చును. దాని వలన ఆయన తీవ్ర వ్యయప్రయాసలకోర్చి జనసేన పార్టీని పునాది స్థాయి నుంచి నిర్మించుకోవలసిన అవసరం ఉండదు. రాష్ట్రంలో భాజపా బలం అంతంత మాత్రమే కనుక దానిలో చేరినట్లయితే, జనసేన ద్వారా తను ఏమి సాధించదలచుకొన్నారో అంతకంటే ఎక్కువే సాధించవచ్చును. ప్రస్తుతం కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉంది కనుక ఆయన పని మరింత తేలికవుతుంది. ఒంటరిగా కొత్త బాట పరుచుకొని ముందుకు సాగాలని ప్రయాసపడే బదులు భాజపా వేసి ఉంచిన రెడీమేడ్ కాషాయ బాటలో సాగినట్లయితే ఆయనకి వాళ్ళు కూడా తోడుగా ఉంటారు కదా? పవన్ కళ్యాణ్ భాజపాకి బహిరంగంగానే మద్దతు ఇచ్చేసారు కనుక ఇప్పుడు భాజపాలో చేరినా కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆయనకిది రెడీమేడ్ మరియు ఇంస్టాంట్ అవకాశంగా భావించవచ్చును కనుక ఈ ప్రతిపాదనను పరిశీలించవచ్చును.