ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవిని … రాజకీయాల్లోకి లాగడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి జనసేన – బీజేపీ పార్టీలు. నాదెండ్ల మనోహర్ అర్థం కాని వ్యాఖ్యలు చేసి చిరంజీవి పేరును ప్రచారంలోకి పెట్టిన ఒక్క రోజులోనే.. సోము వీర్రాజు కూడా అదే పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి భారతీయ జనతా పార్టీ – జనసేన కూటమికి మద్దతిస్తారని సోము వీర్రాజు ప్రకటించుకున్నారు. అదే సమయంలో చిరంజీవి ఏ పార్టీ లోకి వచ్చేది ఆయన ఎక్కడా ప్రకటించ లేదు కానీ.. జనసేన, బిజెపి కి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పారన్నారు. అంటే.. చిరంజీవి రాజకీయాల్లోకి అంటూ వస్తే.. జనసేనలోకే కాదని.. ఇతర పార్టీల్లోకి వస్తాడని ఆయన అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చిరంజీవి లాంటి జనాకర్షక ఉన్న స్టార్ తమ కూటమికి మద్దతుగా ఉంటే.. బలమైన వర్గం మద్దతు పలుకుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కానీ.. జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో అలాంటి పరిస్థితి ఉండదని తేలిపోయింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏ పార్టీలో చేరుతారో చిరంజీవి చెప్పలేదని వ్యాఖ్యానించడంతో.. ఆయన ఇంకా బీజేపీలో చేరతారన్న ఆశలు పెట్టుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బుధవారం జనసేన నాదెండ్ల మనోహర్ … పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారని ప్రకటించారు. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని… జనసేనలో యాక్టివ్‌గా ఉంటారని ప్రచారం జరిగింది.
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి పూర్తి సమయం సినిమాల కోసమే కేటాయిస్తున్నారు. ఎవరైనా రాజకీయ నేతల్ని కలవాలనుకున్నా అది సినిమా రంగ సమస్యల కోసమే స్పందిస్తున్నారు. ఈ తరుణంలో… చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి లాగేందుకు అటు జనసేన.. ఇటు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తాజా ప్రకటనలు నిరూపిస్తున్నాయి. చిరంజీవి కామ్‌గా ఉంటే.. రేపు కాంగ్రెస్ నేతలు కూడా.. ఆయన తమ పార్టీ నేత అని.. త్వరలో యాక్టివ్ అవుతారని ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.