తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సారిగా వచ్చిన ఊపు.. ఆ పార్టీకి చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. నాగార్జున సాగర్లో పోటీ చేసేది తామంటే తాము అని పోటీ పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినట్లుగా గ్రూపులు ఏర్పడ్డాయి. నిజానికి బలమైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై బీజేపీ కన్నేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకూ అభ్యర్థి కోసం ఎలా ఎదురు చూసిందో.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతే. అక్కడ కాంగ్రెస్లో ఉన్న నేతలు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. ఇక్కడ బీజేపీది అలాంటి పరిస్థితే. చివరికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ ముందు కూడా నేతలు టిక్కెట్ కోసం పోటీపడ్డారు.
దాంతో బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని.. ఎవరూ పార్టీ లైన్ దాటరని అనుకున్న ఆయన పరిస్థితి తేడాగా ఉందని… చూసుకోమని బండి సంజయ్కు చెప్పి వెళ్లిపోయారు. ఏ క్షణమైనా సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. మే రెండో తేదీనకౌంటింగ్ జరిగే.. ఎన్నికలు తేదీలు ఉండటం ఖాయం. అయితే ఎప్పుడు తేదీలు వస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీంతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు నాగార్జున సాగర్లో సమీక్షా సమావేశం పెట్టారు. కనీసం పది మంది నేతలు టిక్కెట్ కోసం పోటీ పడటం.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న వైనం అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి కోసం అందరూ కలిసి పని చేయాలని బండి సంజయ్ సూచించి ఆయన కూడా హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు.
అయితే కాంగ్రెస్ లో ఉన్నట్లుగా అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలోనూ ఎక్కువవుతోందన్న సైటైర్లకు బండి సంజయ్ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గెలిచేది తామే కాబట్టే.. మా పార్టీలో టికెట్ కోసం ఎక్కువ పోటీ ఉందని.. టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడం తప్పులేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్లో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రెండు వేలకు కాస్త ఎక్కువ. ఈ సారి పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు తమకు పోటీ కాంగ్రెస్తోనేనని టీఆర్ఎస్ చెబుతోంది.