ఒకప్పుడు పదవుల భర్తీలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ గా ఉండేది..పదవులను భర్తీ చేయాలంటే పార్టీ నేతలతో సంప్రదింపులు , నివేదికల పరిశీలన అంటూ తాత్సారం చేసేది..కానీ , బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. దూకుడుగా పదవులను భర్తీ చేస్తుంటుంది. కానీ ఇదంతా ఒకప్పటి మాట కాబోతోందన్న టాక్ వినిపిస్తోంది.
పదవుల భర్తీలో కాంగ్రెస్ చేస్తున్నట్టుగానే బీజేపీ కూడా ఆలస్యం చేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి విషయంలో నాన్చి, నాన్చి ఎట్టకేలకు అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రకటించినా.. బీజేపీ మాత్రం నాన్చివేతను కొనసాగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని లీకులు ఇచ్చిన జాతీయ నాయకత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది.
కేంద్రమంత్రిగా – రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. పైగా.. ఎమ్మెల్యేలు – కిషన్ రెడ్డి మధ్య సమన్వయం దెబ్బతింటోంది. గతంలోలాగా దూకుడుగా ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేయలేకపోతోంది అన్న భావన బీజేపీ క్యాడర్ లో కలుగుతోంది.
కొత్త అధ్యక్షుడి ప్రకటనతోనే బీజేపీలో కొత్త ఊపు వస్తుందని క్యాడర్ భావిస్తోంది. కానీ, జాతీయ నాయకత్వం మాత్రం ఆదిశగా దృష్టి పెట్టకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఎందుకు సంకోచిస్తున్నారు అని చర్చిస్తున్నారు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.