తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్ -2పరీక్షలు వాయిదా వేయాలంటూ కొనసాగుతోన్న ఆందోళనలపై బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బీజేపీ మాత్రం ఎలాంటి వైఖరి ప్రకటించలేదు. పరీక్షలు వాయిదా వేయాలనో.. షెడ్యూల్ మేరకే పరీక్షలు నిర్వహించాలనో ఏదో ఒకటి తమ వైఖరిని ప్రకటించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీకి అవకాశం ఉన్నా అడ్వాంటేజ్ తీసుకోకపోవడం పట్ల చర్చ జరుగుతోంది.
షెడ్యూల్ మేరకే పరీక్షలను నిర్వహిస్తామని.. వాయిదా వేసే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఈ ఆందోళనల వెనక ఎవరు ఉన్నారో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే, నిజంగా ఈ ఆందోళనలు పెయిడ్ అని భావిస్తోందో ఏమో కానీ, నిరుద్యోగుల ఇష్యూను బీజేపీ పెద్దగా అడ్రస్ చేయడం లేదు. అక్కడక్కడ ఆందోళనలు కొనసాగుతోన్నా బీజేపీ సంఘీభావం కూడా ప్రకటించడం లేదు.
ఈ ఆందోళనలు పూర్తిగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టే..బీజేపీ కూడా ఇదే వైఖరితో ఉందా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయంలో లీడ్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలు అవుతుంది. అదే జరిగితే తమకు మరింత ఇబ్బందులు వస్తాయనే ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గి ఉండొచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీతో మైత్రికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జతకట్టి ఆందోళనలకు దిగితే మరింత తలనొప్పులు ఎదురు అవుతాయనే బీజేపీ ఈ విషయంలో సైలెంట్ గా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.