తెలంగాణలో చేరికల్ని కొనసాగిస్తోంది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా నేత మురళీధరరావు సమక్షంలో ఢిల్లీలో ఈ ఇద్దరూ పార్టీలో చేరారు. భాజపా విధానాలు తమని ఎంతగానో ఆకర్షించాయనీ, అందుకే చేరుతున్నామంటూ ఈ ఇద్దరూ చెప్పారు. రేవూరి మీడియాతో మాట్లాడుతూ… సెంటిమెంట్ తో తెలంగాణ ఏర్పడిందనీ, కానీ గడచిన ఆరేళ్లుగా తెరాస ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు పోతున్నారనీ, తను చేసిన తప్పుల్ని ఎవరూ వేలెత్తి చూపించనియ్యకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వనరుల్ని ఆ కుటుంబం దోచుకుని తింటోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… ప్రజల్లో తెరాస పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలూ, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా తెరాస అవినీతినీ కుటుంబ పాలనను ఎదుర్కోవాలని కోరుకుంటున్నారనీ, ఆ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదుగుతోందన్నారు. అందుకే, భాజపాలోకి ఇతర పార్టీల నుంచి చాలామంది వచ్చి చేరుతున్నారని అన్నారు. భాజపాలో చేరికల్ని చూస్తూ తెరాస బెంబేలెత్తుతోందనీ, అధికార పార్టీ నాయకులు సహించలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి, భాజపా కార్యకర్తలూ నాయకుల మీదా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు! భాజపా ఎంపీలను, ఎమ్మెల్సీలను, సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అధికారుల నుంచి సహాయ నిరాకరణ చేస్తున్నారని అన్నారు. ఆరకంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం తెరాస చేస్తోందన్నారు.
లక్ష్మణ్ చెబుతున్నట్టుగా భాజపాలో చేరేందుకు ఇతర పార్టీలు నాయకులు వస్తున్నారా, లేదంటే ఆ నాయకుల దగ్గరి భాజపా వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తోందా..? నాయకుల సంఖ్యాపరంగా తెలంగాణలో భాజపా బలపడుతోంది. కానీ, ఈ ప్రజల్లో బలపడిందో లేదో ఇంకా నిరూపణ కాలేదు. ఏదో ఒక ఎన్నికలు రావాలి, త్వరలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను దక్కించుకుంటే… కొంత బలపడిందని చెప్పొచ్చు. ఈ మధ్య జరుగుతున్న చేరికలన్నీ తరచి చూస్తే, టీడీపీ బలంగా లేకపోవడం వల్ల వెళ్లిపోయినవారు, కాంగ్రెస్ మరింత బలహీనపడుతోందని భావించి చేరుతున్నవారే ఎక్కువ. వీరంతా తెలంగాణలో భాజపా బలాన్ని చూసి చేరుతున్నారు అనే కంటే… కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉందని ఆకర్షితులౌతున్నవారే ఎక్కువ అనొచ్చు!