నంద్యాల ఉప ఎన్నిక విషయమై తెలుగుదేశం మిత్రపక్షమైన భాజపా ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. అధికార పార్టీకి మద్దతు ఇస్తుందా, తటస్థంగా ఉండిపోతుందా అనే గోడమీది పిల్లివాటం ప్రదర్శిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆ మౌనాన్ని వీడారు ఆంధ్రా భాజపా నేతలు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాయలంలో భాజపా నేతల కీలక సమావేశం జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మద్దతు టీడీపీకే ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. నంద్యాల ఉప ఎన్నికతోపాటు త్వరలో జరగబోతున్న కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు నేతలు సిద్ధమవ్వాలంటూ పార్టీ ప్రకటించింది.
ఈ దశలో ఇది కీలక రాజకీయ పరిణామంగానే చూడాలి. ఎందుకంటే, భాజపాతో టీడీపీ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నట్టుగా ఈ మధ్య కనిపించింది. రాష్ట్రంలో టీడీపీకి ఇబ్బంది కలిగించేలా… అసెంబ్లీ సీట్లు పెంపు విషయంలో కేంద్రమే మోకాలడ్డటం, ప్రతిపక్షమైన వైకాపాను చేరదీస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ 2019 ఎన్నికల్లో కలిసి సాగే అవకాశాలు ఉంటాయా అనే అనుమానాలు రేకెత్తాయి. నంద్యాల విషయంలో కూడా భాజపా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ ఉండటంతో భాజపా వైఖరిపై బాగా చర్చ జరిగింది. ఈ దశలో నంద్యాల ఎన్నికల్లో తమ మద్దతు టీడీపీకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేయడం రాజకీయంగా ఇది కీలక పరిణామమే అవుతుంది. ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ వారంలో భాజపా వర్గాలు కూడా ప్రచారానికి వెళ్లబోతున్నాయి. రెండు పార్టీలూ కలిసి ప్రచారం చేయబోతున్నాయి.
నిజానికి, నంద్యాలలో భాజపా మద్దతు ప్రకటించడం టీడీపీకి అంతగా అనుకూలించే అంశం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, నంద్యాలలో దాదాపు 50 వేలు మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సంప్రదాయంగా వారంతా భాజపాకి వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. ఆ మేరకు టీడీపీకి కొంత నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, ఇదే విషయమై టీడీపీ నేతల విశ్లేషణ ఇప్పుడు మరోలా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మైనారిటీలు భాజపాని ఆదరించారనీ, ఆ పార్టీ ఇమేజ్ మారిందనీ, ప్రజలు అభివృద్ధిని మాత్రమే చూస్తున్నారని కొందరు టీడీపీ నేతలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి, వీరు ఆశిస్తున్నట్టు నంద్యాల బరిలోకి భాజపా దిగడం వల్ల అధికార పార్టీకి ఏ స్థాయిలో లాభిస్తుందో వేచి చూడాలి. గత కొంతకాలంగా టీడీపీ భాజపా నేతలు పరస్పరం విమర్శలు చేసుకునే వాతావరణం ఉండేది. ఇప్పుడు కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి కొనసాగే అంశంపై కూడా కొంత స్పష్టత వచ్చినట్టుగానే చూడొచ్చు.