ఓ వైపు ఎన్నికల ప్రకటన రాబోతోంది. మరో వైపు అయోధ్య అంశంపై.. హిందూ సంస్థలు ఒత్తిడి పెంచుతున్నాయి. కుంభమేళా కేంద్రంగా..రామాలయం కోసం.. ఓ యుద్ధానికి ప్రణాళిక సిద్ధం చేసారు. కుంభమేళా వేదికగా కేంద్రానికి స్వామిజీల డెడ్లైన్ ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ తేదీలను స్వామిజీలు ప్రకటించారు. ఫిబ్రవరి 21న ‘చలో అయోధ్య’కు స్వామిజీల పిలుపునిచ్చారు. అదే సమయంలో అమెరికా అత్యున్నత గూఢచార సంస్థలు.. భారతదేశంలో.. మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని బయటపెట్టింది. ఇండియాలో మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని.. సార్వత్రిక ఎన్నికల ముందు.. బీజేపీ హిందుత్వ అజెండాతో కల్లోలాలు చెలరేగే సూచనలు ఉన్నాయని అమెరికా తేల్చి చెప్పింది. 2019లో ప్రపంచాన్ని కుదిపేస్తాయనే అంచనాలు ఉన్న అంశాలను…ప్రస్తావించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ .. వాటిలో ఇండియాలో మతపరంగా ఉద్రిక్త పరిస్థితి ఉందని తెలిపింది.
కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జరుగుతున్న ప్రచారం ఓ వైపు.. వెనుకబడిపోతున్నామన్న ఆవేదన ఓ వైపు బీజేపీలో కనిపిస్తోంది. ఆ ఆవేదన.. ఇప్పుడు మత విబేధాల రూపంలో బయటకు వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందిన భారతీయ జనతా పార్టీ తన హిందూ జాతీయవాద సిద్ధాంతాలపై ఒత్తిడి తీసుకువచ్చిన పక్షంలో పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మత హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందనేది చాలా మంది అభిప్రాయం. మోడీ పాలనలో బిజెపి విధానాలు కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో మత ఉద్రిక్తతలకు దారితీశాయి. హిందూ జాతీయవాద ప్రచారం ద్వరా తమ కార్యకర్తలను రెచ్చగొట్టవచ్చన్నది బీజేపీ నాయకుల భావన అని .. బీజేపీ మార్క్ రాజకీయాలను విశ్లేషిస్తున్న వారు చెబుతున్న మాట.
నరేంద్ర మోడీ ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాది మే నెలలో పూర్తి కానున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ముందుగానే భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఉద్రికత్తలు తలెత్తే ప్రమాదం ఉందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అందుకే తమ పౌరులకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. నిజానికి ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలను ఎదుర్కొనే విధానం వల్లనే.. ఎక్కువగా.. అమెరికా ఇంటలిజెన్స్ వ్యవస్థలు ఈ నివేదికను సిద్ధం చేసి ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. గుజరాత్ కు సుదీర్ఘ కాలం సీఎంగా మోడీ ఉండటానికి.. ఆయనకు బ్రహ్మస్త్రం… గోధ్రా ఊచకోతనే. ఈ కారణంగానే.. ప్రపంచంలో ఏ దేశం కూడా ఆయనకు వీసా ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్రధాని హోదాలో మాత్రమే ఆయన ఇతర దేశాల్లో పర్యటించారు.