అధికారికంగా పొత్తులు, సీట్ల సర్దుబాటు పై చర్చలు జరగకుండానే తెలంగాణ బీజేపీ- జనసేన పొత్తుపై రగడ ప్రారంభమయింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో వేరువేరుగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నేతలు సమావేశమయ్యారు. ఈ టిక్కెట్లు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ హైకమాండ్ కు పంపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా శేరిలింగంపల్లి జనసేనకు ఇవ్వొద్దన్నారు.
కూకట్ పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రెండు పార్టీల మద్య చర్చలు జరుగుతున్నట్లుగా కూడా స్పష్టత లేదు. గతంలో ఓ సారి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తర్వాత ఢిల్లీలో వీరిద్దరూ కలిసి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు.
పవన్ కల్యామ్.. కుటుంబ కార్యక్రమం కోసం ఇటలీ వెళ్లారు. మరో వైపు మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయిస్తారంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఉన్న నియోజకవర్గాల కు చెందిన నేతలు.. ఆందోళనకు గురవుతున్నారు. తమ స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొద్దంటున్నారు. నామినేషన్ల దాఖలు తేదీ దగ్గర పడుతున్నా.. బీజేపీలో మాత్రం స్పష్టత రాలేదు. జనసేన నేతలు మాత్రం గుంభనంగా ఉన్నారు.