పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంలో అతి పెద్ద అడుగు వేయబోతున్నారు. అది ముందడుగా.. వెనుకడుగా.. అనేది తర్వాత జరగబోయే పరిణామాలతో స్పష్టత వస్తుంది. ఆ అడుగు బీజేపీతో కలవడం. పవన్ కల్యాణ్ మాటల్లో చెప్పాలంటే.. భారతీయ జనతా పార్టీతో .. జనసేన ఎప్పుడూ దూరంగా లేదు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టీపెట్టగానే.. అహ్మాదాబాద్ వెళ్లి మరీ నరేంద్రమోడీని కలిసి వచ్చారు పవన్ కల్యాణ్. ఆ ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చారు. బీజేపీకి మద్దతిచ్చారు. ఏపీలో పొత్తులు పెట్టుకున్న టీడీపీ – బీజేపీకి మద్దతివ్వడానికి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా.. ఇతర అంశాల పట్ల.. ఆయన బీజేపీతో విబేధించి విమర్శలు చేసినా.. ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీని ఓ సేవియర్‌గా చూస్తున్నారు. ఫలితంగా మళ్లీ కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
గురువారం.. విజయవాడలోని ఓ హోటల్లో జనసేన – బీజేపీ ముఖ్యనేతలు తుది చర్చలు జరుపుతారు. ఆ తర్వాత తమ పార్టీల మధ్య బంధం ఎలాంటిదో ప్రకటిస్తారు. ఇప్పటికి చాలా మంది.. జనసేన.. బీజేపీలో విలీనం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం.. కనీసం అలాంటి హింట్స్ కూడా ఇవ్వలేదు. కలిసి పని చేద్దామనే ఆలోచన… ఏ ఎన్నికలు వచ్చిన కలసి పోటీ చేస్తామనే ప్రతిపాదనలే ఉన్నాయని చెబుతున్నారు. అంటే విలీనం ఇప్పుడు లేనట్లే. భవిష్యత్‌లో ఉండొచ్చా.. అంటే.. పరిస్థితుల్ని బట్టి పవన్ కల్యాణ్… ఎన్నికల నాటికి విలీన నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో గురువారం రెండు పార్టీల నేతలూ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
చిరంజీవి.. తన ప్రజారాజ్యం పార్టీని అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఇప్పటికీ ప్రజల్లో హాట్ టాపిక్‌గా ఉంది. దానికి కారణం … పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టడమే. ఆయన కూడా.. ఏదో ఓ పార్టీలో విలీనం చేస్తారని మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని ఖండించడానికే… తనకు అనేక విలీన ప్రతిపాదనలు వచ్చాయని.. కానీ తాను మాత్రం.. పాతికేళ్ల సుదీర్గ రాజకీయం చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన మాటల మీద నిలబడాల్సి ఉంది. లేకపోతే.. ప్రత్యర్థులు క్రెడిబులిటీ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. బీజేపీ – జనసేన బంధం ఎలాంటిదనేది.. గురువారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.