భారతీయ జనతా పార్టీ – జనసేన పొత్తుల తర్వాత తొలి సారి కలసి చేయాలనుకున్న పోరాటం… వాయిదా పడింది. రెండో తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించాలని.. రెండు పార్టీల నేతలు ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరుక మీడియాకు కూడా చెప్పారు. ఇప్పుడు.. ఏమయిందో కానీ.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రెండో తేదీన లాంగ్ మార్చ్ ను వాయిదా వేశామని.. త్వరలో తేదీని ప్రకటిస్తామని మీడియాకు సమాచారం ఇచ్చారు. నిజానికి ఈ రెండు పార్టీలకు తీరిక లేని పనులేమీ లేవు. ప్రజల్లోకి వెళ్లే పెద్ద కార్యక్రమాలేవీ ఇంత వరకూ పెట్టుకోలేదు. మొదటి సారిగా.. పొత్తు బలం ప్రదర్శించేలా.. జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేలా భారీ ప్రదర్శన నిర్వహించాలనుకున్నారు.
పవన్ కల్యాణ్ కు ఉన్న ప్రజాకర్షణ బాగా ఉపయోగపడుతుందని.. గతంలో బీజేపీ సభల్లో..మార్చ్లలో ఎప్పుడూ కనిపించనమంత మంది జనం కనిపిస్తారని ఆశించారు. కానీ.. అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం.. బీజేపీలోని రెండు వర్గాలు.. అమరావతి విషయంలో చీలిపోవడమేనన్న ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం… అమరావతికి మద్దతుగా.. తీవ్ర స్థాయిలో జగన్ పై విమర్శలు చేస్తూండగా.. మరో వర్గం మాత్రం.. మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడుతోంది. ఈ కారణంగానే… కేంద్రం జోక్యం చేసుకునే విషయంలో.. ముందూ వెనుకా ఆలోచిస్తోందని చెబుతున్నారు. జగన్కు సపోర్ట్ చేస్తున్న వర్గంలో ముఖ్యుడైన జీవీఎల్.. కేంద్రానికి సంబంధం లేదని.. వాదిస్తూ.. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ వస్తున్నారు.
వీరి డబుల్ స్టాండర్డ్స్ జనసేన నేతల్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నట్లుగా చెబుతున్నారు. అమరావతి తరలింపును అడ్డుకుంటామనే గట్టి హామీతోనే…తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని పవన్ చెబుతున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి మాత్రం.. అలాంటి స్పందన కనిపించడం లేదు. ఈ క్రమంలో మార్చ్ వాయిదా… రెండు పార్టీల మధ్య పరిస్థితి సజావుగా ఉందా.. అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.