బిజెపి జనసేన పార్టీలు ఇక పై ఆంధ్రప్రదేశ్ లో కలిసి పని చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఢిల్లీలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం గా మారనుంది. ఈ రెండు పార్టీల నేతలు ఈ రోజు విజయవాడలో సమావేశం కానున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగింపు, స్థానిక సంస్థల్లో కలిసి పోటీ చేయడం, ఇకపై జరిగే రాజకీయ కార్యక్రమాల్లో కలిసి పాలు పంచుకోవడం వంటి అంశాల మీద చర్చించనున్నారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి నడవడం, ఇద్దరికీ లాభిస్తుందా, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈ పరిణామం ఈ విధంగా మేలు చేకూరుస్తుంది అన్న చర్చ జరుగుతోంది.
ఒకరి బలహీనత ని మరొకరు పూడ్చగలిగే mutually complementing కాంబినేషన్:
బిజెపి జాతీయ పార్టీ అయినప్పటికీ, ఆ పార్టీకి అనేక రాష్ట్రాల్లో బలం ఉన్నప్పటికీ , ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలపడలేకపోతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది బిజెపిలో జనాకర్షణ కలిగిన నాయకుడు, క్రౌడ్ పుల్లర్ లేకపోవడం. ఇక రెండవ బలహీనత, బిజెపికి కేవలం కొన్ని ఓసీ వర్గాలకు చెందిన ప్రజల లో తప్ప మిగతా వారి లో మద్దతు లేకపోవడం. జనసేన బిజెపి కలిసి పని చేయడంతో, బిజెపికి దాదాపు ఈ బలహీనతలను అధిగమించే అవకాశం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాకర్షణ కలిగిన రాజకీయ నాయకులలో ముందువరుసలో ఉంటాడని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అదేవిధంగా ఎవరు అవునన్నా కాదన్నా కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ మీద చెక్కుచెదరని అభిమానం ఇప్పటికీ ఉంది. 2019 ఎన్నికలలో అది ఓట్లు గా మార లేక పోయినప్పటికీ, సరైన రీతిలో ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగిన ఆ సామాజిక వర్గం ఓట్లు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ వైపు పూర్తిగా మరలించే అవకాశం ఉంది.
అదేవిధంగా జనసేన పార్టీకి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందులో మొదటిది డబ్బు లేకపోవడం. 2019 ఎన్నికలలో ప్రధాన పార్టీలలో అత్యంత తక్కువ డబ్బు ఖర్చు పెట్టింది జనసేన యే. కేవలం పవన్ కళ్యాణ్ జనాకర్షణ ని నమ్ముకుని డబ్బుతో ప్రమేయం లేకుండా ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలు దీర్ఘకాలంలో పని చేయకపోవచ్చు. పార్టీ రాజకీయ కార్యక్రమాల నిర్వహణ భారంగా పరిణమించ వచ్చు. బిజెపితో జత కట్టడం ద్వారా, పార్టీ కార్యక్రమాలను ప్రజా పోరాటాలను కలిసి నిర్వహించడం ద్వారా, జనసేన పార్టీ కోసం నిధులు సమీకరించాల్సి న అవసరం పవన్ కళ్యాణ్ కు తప్పుతుంది. దీంతోపాటు, జనసేన పార్టీ కార్యక్రమాలకు మీడియా మద్దతు పూర్తిగా కొరవడడం కూడా 2019 ఎన్నికలలో జనసేన ఓటమికి ఒక కారణం. ప్రస్తుతం ప్రతి మీడియా ఛానల్ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తూ ఉండడం, అగ్ర ఛానల్స్ సైతం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తే కథనాలు ప్రసారం చేయడం వంటి పరిణామాల కారణంగా జనసేన పార్టీకి మీడియా మద్దతు పొందడం అనేది పెనుసవాలుగా మారింది. అయితే జాతీయ పార్టీ బిజెపితో కలిసి చేసే పోరాటాలకు, కలిసి చేసే కార్యక్రమాలకు మీడియా కవరేజ్ పొందడం సునాయాసం అవుతుంది. అదే సమయంలో జన సేన మీద, మీడియా ఉద్దేశపూర్వక నెగటివ్ కథనాలు ప్రసారం చేయకుండా వాటిని నియంత్రించడం కూడా ఇదే కారణంతో సాధ్యమవుతుంది. వీటన్నింటికంటే జనసేనకు ఉన్న మరొక ముఖ్యమైన బలహీనత ఎలక్షనీరింగ్, బూత్ మేనేజ్మెంట్ లో అనుభవం లేకపోవడం. అయితే ఈ విషయాల్లో బిజెపి పార్టీ ది భారత దేశంలో నే అందె వేసిన చేయి.
బిజెపి తో ప్రయాణం జనసేనకు నష్టంగా పరిణమించే అవకాశం ఉందా?
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే సమయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభ బలంగానే ఉంది. కానీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు ఆ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బిజెపి కూడా ఇప్పటికే ఐదేళ్లు పూర్తి చేసుకొని రెండవసారి పాలన చేస్తోంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి బాగానే ఉన్నా, తదుపరి ఎన్నికలు వచ్చే సమయానికి అంటే బిజెపి పాలన పది సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి బిజెపి మీద దేశవ్యాప్తంగా anti incumbency వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత దానితోపాటు దాని మిత్రపక్షాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే జనసేన కు అది తీవ్ర నష్టంగా పరిణమించే అవకాశం ఉంది.
అదే విధంగా బిజెపి తో పొత్తు ఖరారైన మర్నాటి నుండి, ఆ పార్టీ చేసే పొరపాటు వ్యాఖ్యానాలకు, పొరపాటు నిర్ణయాలకు జనసేన కూడా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మైనారిటీ లలో, దళితులలో భయాందోళనలు కలిగించే వ్యాఖ్యలు బిజెపి నేతలు ఎవరైనా చేసినప్పుడు జనసేన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది.
మొత్తం మీద:
జనసేన పార్టీని విలీనం చేయాల్సిందిగా బిజెపి వైపు నుండి ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, విలీనం చేయకుండానే పొత్తును బీజేపీ అంగీకరించేలా చేసుకోవడం పవన్కళ్యాణ్ సాధించిన మొదటి విజయం. కొన్ని సందర్భాలలో ఈ పొత్తు ఇబ్బందికరంగా మారే పరిణామాలు ఉన్నాయని తెలిసి కూడా, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, ప్రతిపక్ష పార్టీలను దీటుగా ఎదుర్కోవడానికి జనసేన కు ఈ పొత్తు లాభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అదే సమయంలో బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్లో బలపడే అవకాశం కచ్చితంగా ఉంటుంది.