మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల ఇరవై మూడో తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఇప్పుడు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. కానీ మిత్రపక్షం జనసేనను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోలేదు. ఏ ఎన్నిక వచ్చినా తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. జనసేనకు చాన్సివ్వడం లేదు. తిరుపతిలో పట్టుబట్టి మరీ సీటు తీసుకుంటే.. జనసేన ఓట్లు మాత్రమే బీజేపీకి లభించాయి. బద్వేలులోనూ అంతే.
అయితే ఎవరూ పోటీలో లేకపోతే.. తమకు వచ్చే కొన్ని ఓట్లతోనే తాము బలంగా మారాలని చెప్పుకునేందుకు బీజేపీకి ఓ అవకాశం దొరుకుతుంది. అందుకే ఎవరూ పోటీ చేయకపోయినా తాము పోటీ చేస్తామని చెబుతున్నారు. బద్వేలులో ఇరవై వేల ఓట్లు రావడంతో అదంతా తమ బలమేనననుకుంటున్నారు. కానీ ఇతర పార్టీలు ఏవీ పోటీ చేయలేదనే సంగతిని మర్చిపోతున్నారు. ఆత్మకూరు ఉపఎన్నిక విషయంలో జనసేన ఆలోచనలేమిటో స్పష్టత రాలేదు. బీజేపీ కూడా జనసేన అభిప్రాయాన్ని తీసుకోకుండానే చాలెంజ్ చేస్తోంది.
టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే పోటీ చేయని సంప్రదాయం ఉంది. టీడీపీ దాన్ని పాటిస్తోంది. అయితే ఇప్పుడు మేకపాటి గౌతంరెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలనుకుంటే ఈ కారణం చూపించే అవకాశం ఉంది. అలాగే .. సానుభూతితో పోటీ చేయకపోతే.. పారిపోయారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో అయినా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉందన్న చర్చ టీడీపీలో ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది .