గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారానికి సంబంధించిన రాజకీయ దుమారం అంతకంతకూ పెరుగుతోంది. టీడీపీ ఇప్పటికే ఈ అంశాన్ని పూర్తి హైలెట్ చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగింది. గుడివాడలో కేసీనో జరిగిన కే కన్వెన్షన్ సెంటర్ను పరిశీలిస్తామని సోము వీర్రాజు, సీఎం రమేష్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు ఎక్కడిక్కకడ అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లకుండానే దారిలోనే వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు నడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధపడ్డారు.
అక్కడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంత దూరం నడిచిన తరవాత చిన్న ట్రాలీల్ని తీసుకు వచ్చి బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసి అందులో ఎక్కించి తోసుకెళ్లారు. కొడాలి నానికి బీజేపీ అంటే భయమని.. సోము వీర్రాజు మండిపడ్డారు. కేసినో వ్యవహారంలో కొడాలి నానిపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని.. ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసినో వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఆ విషయం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో.. ఎదురుదాడి చేయడానికి కొడాలి నాని బూతులను ఆయుధంగా చేసుకోవడంతో విషయం పెద్దదైపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ కూడా కేసినో వ్యవహారంపై రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.