ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు అయిన దగ్గర్నుంచీ ఏపీ భాజపా నేతలు పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు! రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతాం, తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు ఉండదు అంటూ ఎన్నికల ముందు చాలా చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తరువాత… ఇతర పార్టీలన్నీ తమ గెలుపు అవకాశాలపై మాట్లాడుతుంటే, ఏపీ భాజపా నేతలు మాత్రం ఇంకా చంద్రబాబు నాయుడుని విమర్శించే పనిలోనే ఉన్నారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారం చెయ్యడానికి వెళ్లారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. బెంగుళూరులో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ప్రజలే నమ్మడం లేదని. కర్ణాటకలో తెలుగువారు ఎందుకు నమ్ముతారని ఆయన విమర్శించారు.
ఈ దేశానికి మరోసారి మోడీ ప్రధానమంత్రి అవుతారనీ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు భాజపాకి దక్కుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు కన్నా. మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి అబద్ధాలను ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటనీ, అవన్నీ తట్టుకుని ప్రజల్లోకి వాస్తవాలను తాము తీసుకెళ్తున్నామన్నారు. మండిలో చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారనీ, డర్టీ ఇండియా, వరస్ట్ ఇండియా అంటూ విమర్శలు చేశారన్నారు. మోడీ శైలి నచ్చకపోతే ఆయనపై నేరుగా విమర్శలు చెయ్యొచ్చుగానీ, ఇలా దేశంపై మాట్లాడటం సరికాదన్నారు. కర్ణాటకలో ఉండే తెలుగువారు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరనీ, సొంత రాష్ట్ర ప్రజలే ఆయన్ని వద్దనుకుని ఎన్నికల్లో ఓట్లు వేశారని కన్నా చెప్పారు.
కర్ణాటకలో కూడా చంద్రబాబు విమర్శలే ప్రచారమా? అక్కడ అది స్థానిక అంశం కాదు కదా? ఎవరికి ఆసక్తి ఉంటుంది? గడచిన ఐదేళ్లలో మోడీ ఏం సాధించారు, దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, కర్ణాటక ప్రజలకు జరిగిన లబ్ధి ఏంటి… ఇలాంటివేవో మాట్లాడాలి. సరే, అలాంటివేవీ ప్రచారం చేసుకోవడానికి లేవనుకున్నప్పుడు… ఏపీలో భాజపా ఏం చేసిందో చెప్పాలి. జరిగిన ఎన్నికల్లో ఏపీలో భాజపా జెండా ఎగరేస్తోందనో, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతున్నామనో, పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలుస్తున్నారనో కర్ణాటకలో కన్నా చెప్పాలి. దక్షిణాదిన భాజపా బలపడతోందన్న సంకేతాలు ఇచ్చేలా ప్రచారం చేస్తే కాస్తైనా ప్రయోజనం ఉంటుంది. అంతేగానీ, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడుని ఎవ్వరూ నమ్మరూ అంటుంటే ఏమనుకోవాలి?